ఉత్తరాంధ్ర సాగునీటి స్వప్నం సాకారం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి
ప్రజాశక్తి - టెక్కలి రూరల్ : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను దశాబ్దాలుగా వేధిస్తున్న వంశధార నీటి వివాదానికి స్వస్తి పలుకుతూ నేరడి బ్యారేజీ నిర్మాణానికి రూ. 641 కోట్లు మంజూరు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర గెజిట్ సాధించడంలోనూ, నిధులు మంజూరు చేయించడంలోనూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసాధారణ చొరవ ప్రదర్శించారు. జిల్లా సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు సాధనకై ఆయన తొలినుంచి నిరంతర పట్టుదలతో కృషి చేశారు. నాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ట్రిబ్యునల్ వివాదాల నుంచి ప్రాజెక్టును గట్టెక్కించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించిన అచ్చెన్నాయుడు, లీగల్ పోరాటంలో రాష్ట్ర వాదనలు ట్రిబ్యునల్‌లో బలంగా వినిపించేలా చేసి చారిత్రాత్మక తీర్పు రావడంలో ప్రధాన భూమిక పోషించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార దశ-II పూర్తిపై ప్రత్యేక దృష్టోత్సాహంతో వ్యవహరించిన మంత్రి అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి సూచనలు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెచ్చారు. ఈ సుదీర్ఘ ప్రయత్నాల ఫలితంగానే కేంద్ర జలశక్తి శాఖ ట్రిబ్యునల్ తీర్పును అధికారికంగా గెజిట్‌లో ప్రచురిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఒడిశా భూభాగంలోని 106 ఎకరాల సేకరణకు మార్గం సుగమం కావడమే కాకుండా, బ్యారేజీ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి హక్కులు లభించాయి. ఏళ్ల తరబడి పాలకుల నిర్లక్ష్యంతో పెండింగ్‌లో పడిన ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించి గెజిట్ సాధించడం అచ్చెన్నాయుడు రాజకీయ రాజనీతికి, ప్రాంతీయ అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది. కేంద్ర గెజిట్ విడుదలైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేబినెట్ భేటీలో రూ. 641 కోట్లను మంజూరు చేయించడం ద్వారా అచ్చెన్నాయుడు తన కార్యాచరణ వేగాన్ని నిరూపించుకున్నారు. రాబోయే రెండేళ్ల వ్యవధిలోనే నెరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి వెనుకబడిన, కరువు పీడిత ప్రాంతాల రైతులకు నీళ్లందిస్తామని ప్రకటించి జిల్లా ప్రజల దశాబ్దాల కలను సాకారం చేశారు. చట్టపరమైన చిక్కులను అధిగమించి, నిధులు రాబట్టి, నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేసేలా అచ్చెన్నాయుడు తీసుకుంటున్న చర్యలపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.








కామెంట్‌లు (0)