- స్తంభించిన రాకపోకలు
- ప్రత్యామ్నాయ దారిలో ప్రయాణ కష్టాలు
ప్రజాశక్తి-ఇచ్ఛాపురం : ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో బాహుదా నది ఉగ్రరూపం దాల్చడంతో ఈదుపురం వెళ్లే మార్గంలో వరద గట్టుకు భారీ గండి పడింది. దీంతో ఈదుపురం వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయి, ఇచ్ఛాపురం నుంచి ఈదుపురం కొత్త వంతెన మీదుగా సాగించే రాకపోకలు స్తంభించిపోయాయి. ఒక్కసారిగా రహదారి తెగిపోవడంతో ఈ ప్రాంత ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీస్థాయిలో గండి పడటంతో ప్రస్తుతం అక్కడ తాత్కాలికంగా రహదారిని ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇచ్ఛాపురం నుంచి ఈదుపురం వెళ్లే వారు ఇన్నీసుపేట, ధర్మపురం మీదుగా చుట్టూ తిరిగి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడంతో పాటు ప్రజలు అదనపు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారులు స్పందించాలి
వరదల కారణంగా దెబ్బతిన్న రహదారిని పునరుద్ధరించడంలో జాప్యం జరిగితే స్థానిక ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నిత్యావసర పనులు, వ్యవసాయ కార్యకలాపాలు, ఇతర అవసరాల కోసం ఇచ్ఛాపురం వెళ్లే వారికి ఈ మార్గం కీలకంగా ఉండటంతో రాకపోకల అంతరాయం సమస్యగా మారింది. సంబంధిత అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతంగా రహదారిని పునరుద్ధరించే పనులు చేపట్టడంతో పాటు అప్పటివరకు ప్రజలకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులు స్పందించి రాకపోకలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.







కామెంట్‌లు (0)