ప్రజాశక్తి- రణస్థలం
రైతులకు ఎరువుల కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, విక్రయాల్లో పారదర్శకతను పెంచే లక్ష్యంతో ప్రవేశపెట్టిన 'ఎఫ్ఎఫ్ఎస్' యాప్ వినియోగంపై శుక్రవారం డివిజన్ స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులకు, సిబ్బందికి, డీలర్లకు యాప్ పనితీరుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ డిజిటల్ విధానం ద్వారా ఎరువుల విక్రయాలను సమర్థవంతంగా నిర్వహించి, అన్నదాతలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా రైతులు తమకు అవసరమైన ఎరువులను యాప్లోనే నేరుగా ఎంపిక చేసుకోవచ్చన్నారు. అనంతరం క్యూఆర్ కోడ్ సహాయంతో తమకు అనుకూలమైన ఎరువుల డీలర్ను ఎంచుకుని సులభంగా ఎరువులు కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, డీలర్లు ఈ యాప్ వినియోగంపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకుని, క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆయన సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా యాప్ ఇన్స్టాలేషన్, లాగిన్ ప్రక్రియ, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డీలర్ ఎంపిక, ఎరువుల కొనుగోలు విధానంపై సాంకేతిక అంశాలను విపులంగా వివరించారు. కార్యక్రమంలో రణస్థలం డివిజన్ పరిధిలోని రణస్థలం, లావేరు, జి.సిగడం, పొందూరు మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, ఆయా మండలాల ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.
ఫోటో: ఎఫ్ఎఫ్ఎస్ యాప్ వినియోగంపై శిక్షణ ఇస్తున్న అధికారులు






కామెంట్లు (0)