తప్పిన పెను ప్రమాదం.. బస్సులో సుమారు 100 మంది విద్యార్థులు
గుడిబండ (శ్రీసత్యసాయి) : శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లింది. కడుపులయపాళ్యం వద్ద టర్నింగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 100 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. పెను ప్రమాదం తప్పడంతో విద్యార్థులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నాచేపల్లి నుంచి గుడిబండ, రామాయహట్టి, కడుపులయపాళ్యం మీదుగా మడకశిరకు బస్సు వెళుతుండగా కడుపులయపాళ్యం వద్ద టర్నింగ్‌లో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. బస్సులో పరిమితికి మించి విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని బస్సులోని విద్యార్థులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల సంఖ్య, ఎవరికైనా గాయాలయ్యాయా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.








కామెంట్‌లు (0)