ప్రజాశక్తి-ఓబుళదేవరచెరువు
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మిట్టపల్లి గ్రామానికి చెందిన రైతు వల్లం నాగభూషణ (49)కు 4.5 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఇందులో మూడు బోరుబావులు వేశారు. అందులో రెండు ఎండిపోయాయి. మిగిలిన ఒక దానిలో అరకొర నీరు వస్తున్నాయి. ఈ నీటితోనే వరి, మిరప, అనప, జెర్సీగడ్డి వేశారు. పంటల సాగు నిమిత్తం బ్యాంకులో రూ.ఎనిమిది లక్షలు, ప్రయివేటు వ్యక్తుల వద్ద రూ.ఐదు లక్షల వరకు అప్పులు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో బోరు బావులు ఎండిపోవడంతో పంటలు చేతికందలేదు. అప్పులు తీరే దారిలేక మంగళవారం సాయంత్రం తన పొలంలో పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మంగళవారం రాత్రి అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఆయనకు భార్య నీలమ్మ , కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.








కామెంట్‌లు (0)