* స్థానిక సంస్థలకు అధికారాలేవి?
* ప్రభుత్వ రంగ సంస్థలును ప్రైవేట్ పరం చేస్తున్న ప్రభుత్వాలు
* 39 వార్డు సిపిఎం అభ్యర్థిని గెలిపించాలి...
* మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు అధ్వానం
* 39వ వార్డులో ప్రచారం నిర్వహించిన సిపిఎం రాష్ట్ర నాయకులు ఓబులు...
కదిరి మున్సిపాలిటీ 39 వ వార్డు సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థి ముస్తాక్ తరపున ఆపార్టీ రాష్ట్ర నాయకులు ఓబులు తదితరులు గురువారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 39వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలిసి ఓటును అభ్యర్థించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో మున్సిపాలిటీల్లో ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాలు కుంటుపడుతున్నాయని అన్నారు. 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు అధికారాలు, బాధ్యతలు బదలాయించాల్సి ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం కారణంగా స్థానిక సంస్థలు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి లేకుండా పోతోందని అన్నారు. గతంలోనూ, ప్రస్తుతం కూడా స్థానిక సంస్థలకు తగిన అధికారాలు, వనరులు కల్పించలేదని దీంతో వార్డులలో పంచాయతీలో ప్రజా సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందని విమర్శించారు. గతంలో వైసీపీ హయాంలో పలు ప్రభుత్వం సంస్థలైనా విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణ కోసం పూనుకోవడం తో గత ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారన్న విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. 39వ వార్డులో పర్యటించినప్పుడు పలు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా కనిపిస్తోందని, మురుగునీటి పారుదల సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. రోడ్లు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల నిర్వహణలో మున్సిపాలిటీలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మున్సిపాల్టీ కి ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు అందుకు తగిన స్థాయిలో సేవలు అందించాల్సిన బాధ్యతను విస్మరించకూడదన్నారు. ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లిస్తున్న ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, నాణ్యమైన రహదారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గతంలో వైసీపీ హయాంలో విద్యుత్ మీటర్లు ఏర్పాటు పై అప్పట్లో టీడీపీ నాయకులు మీటర్లను పగలగొడతామని హెచ్చరించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మాటను విస్మరించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో పాటు, ప్రజలపై పడే భారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థలకు కేవలం బాధ్యతలు అప్పగించడం కాకుండా, వాటిని సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన నిధులు, అధికారాలను కూడా బదలాయించాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలు ప్రజలకు మరింత చేరువగా పనిచేసేలా పాలనా వ్యవస్థలో మార్పులు రావాలని, వార్డుల్లో నెలకొన్న స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కరించే సిపిఎం ను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ ఎల్ నరసింహులు, పట్టణ అధ్యక్షుడు జగన్మోహన్, సిఐటియు పట్టణ కార్యదర్శి బాబ్జాన్, వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ముస్తాక్, రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)