పెట్టుబడి కూడా దక్కదంటూ ఆవేదన
అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికొస్తే కష్టాలు తీరుతాయని ఆశించిన రైతన్నకు చివరకు నిరాశే మిగులుతోంది. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, తెగుళ్ల దాడి కంది రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఆశించిన వర్షాలు లేక పంట సాగు ప్రారంభం నుంచే ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు, ఇప్పుడు పూత దశలో విరుచుకుపడుతున్న లిల్లీబగ్ తెగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఐదు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట మరో నెలన్నర రోజుల్లో చేతికొస్తుందనుకున్న తరుణంలో తెగులు వ్యాపించడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా సుమారు 3.20 లక్షల ఎకరాల్లో కంది సాగు చేసినట్లు అంచనా. బత్తలపల్లి మండలంలోనే దాదాపు 8 వేల ఎకరాల్లో రైతులు కంది పంటను సాగు చేశారు. సీజన్ ప్రారంభంలో సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం అక్టోబర్లో తుఫాన్ ప్రభావంతో కురిసిన చిరుజల్లులకు పంట కొంతమేర ఏపుగా పెరగడంతో ఈసారైనా మంచి దిగుబడి వస్తుందని ఆశపడ్డారు. సాగు ఖర్చులు, ఎరువులు, పురుగు మందుల కోసం అప్పులు చేశారు. తీరా పంట పూత దశకు చేరుకున్న సమయంలో లిల్లీబగ్ తెగులు వ్యాపించడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మండలంలోని గుమ్మలకుంట గ్రామానికి చెందిన వరిమడుగు ధర్మేందర్ రెడ్డి, రజిత దంపతులు ఎనిమిది ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. ఇప్పటివరకు సాగు, ఎరువులు, పురుగుమందుల కోసం సుమారు రూ.1.60 లక్షలు ఖర్చు చేశారు. పంటకు తెగులు సోకడంతో దానిని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల దుకాణదారుల సూచనల మేరకు ఐదుసార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. అయినా తెగులు ఉధృతి తగ్గకపోవడంతో పంటను ఎలా కాపాడుకోవాలనే ఆందోళనలో ఉన్నారు. పంట చేతికొచ్చి అప్పులు తీరుతాయని భావిస్తే, ఇప్పుడు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో నష్టపోయిన రైతులకు తెగుళ్ల రూపంలో మరో సమస్య ఎదురుకావడంతో వ్యవసాయం భారంగా మారుతోంది. పంటను కాపాడుకునేందుకు రైతులు పెట్టే ప్రతి అదనపు ఖర్చు అప్పుల భారాన్ని మరింత పెంచుతోంది. కళ్లముందే పంట దెబ్బతింటున్నా ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం నష్ట పోయిన రైతులను గుర్తించి పంట నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.
లిల్లీ బగ్ కాదు వడ తెగులు :ఏవో
కంది పంటను ఆశించిన తెగులు లిల్లీ బగ్ కాదని వడ తెగులు అని ఏవో ఓబిరెడ్డి తెలిపారు. ఈ వ్యాధి నియంత్రణకు సమగ్ర యాజమాన్యం పాటించాలని మొక్కకు ఒకసారి తీవ్రమైన విల్ట్ సోకితే తిరిగి కోలుకోవడం కష్టమని అన్నారు. తెగులు ప్రారంభ దశలోనే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఎండిపోయిన మొక్కలను వేర్లతో సహా తొలగించి పొలం బయట నాశనం చేయాలన్నారు. పొలంలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ ఏర్పాటు చేయాలన్నారు. కార్బెండజం ఒక గ్రామ్ లీటర్ నీటిలో కలిపి తెగులు కనిపించిన మొక్కల చుట్టూ నేల తడిసేలా పిచికారి చేయాలన్నారు.







కామెంట్లు (0)