విద్యార్థులు, తల్లిదండ్రులతో ఎంబీయూ ఛాన్సలర్ డాక్టర్ మోహన్ బాబు
ప్రజాశక్తి - చంద్రగిరి : చంద్రగిరి మండలంలోని రంగంపేట దగ్గర ఉన్న మోహన్‌బాబు యూనివర్సిటీలో క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యే తమ ప్రధాన ధ్యేయమని, క్యాంపస్‌లో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి తన బిడ్డతో సమానమని ప్రముఖ విద్యావేత్త, యూనివర్సిటీ ఛాన్స్‌లర్ డాక్టర్ మంచు మోహన్ బాబు పేర్కొన్నారు. గురువారం యూనివర్సిటీ ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విద్యా సంవత్సరంలో (2026- 27) జాయిన్ అయిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నామని ఆయన తెలిపారు. తమ ప్లేస్‌మెంట్ సెల్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు అత్యున్నత వేతనాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. వివిధ ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు అప్పుడప్పుడు ఫోన్ చేసి, తమ విజయానికి యూనివర్సిటీ వేసిన బాటలే కారణమని కృతజ్ఞతలు తెలుపుతుంటే ఒక విద్యాసంస్థ అధినేతగా ఎంతో గర్వంగా అనిపిస్తుందని అన్నారు. యూనివర్సిటీలో చదువుకుని ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి ఉన్నత సివిల్ సర్వీస్ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యం ఉన్న విద్యార్థులకు సంస్థ తరఫున పూర్తిగా ఉచిత శిక్షణ అందిస్తామని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను యూనివర్సిటీకి పంపిస్తున్నారని, వారి ఆశయాలను నిజం చేసే బాధ్యత తమపై ఉందని అన్నారు. విద్యాప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ఆత్మీయ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి.వి. రమణ, రిజిస్ట్రార్ సారథి, ఫైనాన్స్ ఆఫీసర్ రవిశంకర్, వివిధ విభాగాల డీన్స్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)