ప్రజాశక్తి- మంగళం (తిరుపతి) : తిరుపతి రూరల్ మండలంలోని భూములకు రక్షణ లేకుండా పోయిందని, మితిమీరిపోతున్న భూ కబ్జాలపై కలెక్టర్ వెంటనే స్పందించి వాటిని అరికట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అభిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులను, రెవెన్యూ యంత్రాంగాన్ని లెక్కచేయకుండా యథేచ్ఛగా కబ్జాలు చేస్తూ కోట్ల విలువైన భూమిని దోచుకుంటున్నారని భూ కబ్జాదారులు ఏ పార్టీకి చెందిన వారైనా వారిని వదిలి పెట్టవద్దని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ లక్షల రూపాయలు వెచ్చించి వనజాక్షమ్మ అనే మహిళ తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 476/1లో ఉన్న 3.17 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, దానిని రాజకీయ మద్దతుతో కొందరు కబ్జా చేశారని, దీనిపై స్థానిక తహశీల్దార్, జిల్లా రెవెన్యూ యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి, ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కరకంబాడి రోడ్డు మార్గంలో ఉన్న వేణుగోపాల కాలనీని ఏడాది క్రితం గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే జెసిబి యంత్రాలతో కూల్చేశారని, వారు ఎవరూ? ఎందుకు కూల్చేశారు? అన్నదానిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజా గొంతుకగా వినిపించే తమపైన డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారని, తమపై కాకుండా దోపిడీ, భూ ఆక్రమణదారులపై ఆ కెమెరాలను పెట్టాలని పోలీసు శాఖకు సూచించారు. గాంధీపురం పంచాయతీలో స్వామి హథీరాంజీ మఠానికి చెందిన భూములను యథేచ్ఛగా ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు కడుతుంటే అడ్డుకోవాల్సిన యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఈ భూ కబ్జాలను అడ్డుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ మరింత నగరంలో రోజురోజుకీ భూ కబ్జాలు అధికారులే ఉండడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చంద్రగిరి నియోజకవర్గ బాధ్యులు ఐరాల లోకేష్ రెడ్డి, విశ్వనాధ్, రాధాకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.
భూ కబ్జాలను అరికట్టాలి : కలెక్టరేట్ వద్ద అఖిలపక్షం ధర్నా
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 21, 2026, 10:02 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)