సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొత్త క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ విధానం వద్దు : రేషన్ డీలర్ల ఆందోళన

28 ఆగస్టు, 2026

No to the new QR code scanning system: Ration dealers express concern.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 03:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : చంద్రగిరిలోని రేషన్ షాపులో నూతన క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ విధానంపై రేషన్ డీలర్లు శుక్రవారం ఆందోళన చేపట్టారు. క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ విధానం రద్దు చేయాలని డిప్యూటీ తహసీల్దార్ దివాకర్ కు మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు వినతిపత్రాన్ని సమర్పించారు. సెప్టెంబర్ నుంచి రేషన్ బియ్యం బస్తాలపై క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ విధానం అమలు చేయడంపై రేషన్ డీలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి బస్తా రేషన్ షాపుకు దిగుమతి చేసే సమయంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి స్టాక్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. బియ్యం పంపిణీ సమయంలో ప్రతి రెండు బస్తాలకు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఈ-పోస్‌లో నమోదు చేయాల్సి రావడంతో పని భారం పెరుగుతుందని రేషన్ డీలర్లు తెలిపారు. చాలామంది రేషన్ డీలర్ల వద్ద ఇప్పటికీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు అందుబాటులో లేవని, దీంతో సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా చంద్రగిరి మండలం పరిధిలోని గంగుడుపల్లి, రంగంపేట, భీమవరం, కొండిరెడ్డి కండ్రిగ, ఇతర గ్రామాలలో నెట్వర్క్ లేక ఇబ్బందిపడుతున్నామన్నారు. మండల స్థాయి స్టాక్ పాయింట్లలోనే క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. స్టాక్ పాయింట్లలో జరుగుతున్న బరువు, తరుగు తదితర సమస్యల వల్ల ఇప్పటికే ప్రతి నెల 100 నుంచి 300 కిలోల వరకు నష్టం వాటిల్లుతోందని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 50 కిలోల బస్తాలుగా క్యూ ఆర్ కోడ్ నమోదు చేయడం ద్వారా స్టాక్ పాయింట్లలోని అవకతవకలకు రేషన్ డీలర్లను బాధ్యులను చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని పునః సమీక్షించి, సమస్యలు పరిష్కరించే వరకు అమలు నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి రేషన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, కమిటీ సభ్యులు డీలర్లు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్