- డాక్టర్స్ డే సందర్భంగా..
ప్రజాశక్తి-సూళ్లూరుపేట రూరల్ : డాక్టర్స్ డే సందర్భంగా బుధవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్‌లో వీనస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సంక్షేమం కోసం ‘ఆటో రక్ష’ ఆరోగ్య రక్ష పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి అధినేత డాక్టర్ కే. వెంకన్న బాబు ప్రారంభించి ఆటో కార్మికులకు ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకన్న బాబు మాట్లాడుతూ, ఆటో రక్ష పథకం ద్వారా ఆటో కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ వీనస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉచిత ఓపీ సేవలు అందించడంతో పాటు మందుల కొనుగోలుపై, ల్యాబ్ పరీక్షలపై ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ఆటో కార్మికులు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ధూమపానం, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ఆటో కార్మికుల ఆరోగ్యమే వారి కుటుంబాలకు, సమాజానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ ఆటో రక్ష పథకం అమలుకు ఆటో కార్మికుల తరఫున సీఐటీయూ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు కె.లక్ష్మయ్య, కార్యదర్శి సుబ్రమణ్యం ప్రత్యేక కృషి చేశారని డాక్టర్ వెంకన్న బాబు అభినందించారు. ఆటో కార్మికుల సంక్షేమానికి ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆటో కార్మికులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ఆటో యూనియన్ కమిటీ అధ్యక్షులు మరియు కార్యదర్శిలు ఎ.వెంకటేశ్వర్లు, డి.వెంకటరమణ, మధు, శివ, భాస్కర్ వెంకటేశ్వర్లు వెంకట కిషోర్ మరియు, ఆటో కార్మికులు పాల్గొన్నారు








కామెంట్‌లు (0)