ఎ ఎన్ యు (విశాఖ) : జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం కు చెందిన ఫొటోగ్రాఫర్ కుంచం రాజేష్ ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ కు ఎంపికయ్యారు. ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (PAI) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్–2026లో ఆయన తీసిన ఛాయాచిత్రం ఈ అవార్డుకు ఎంపికైంది. నాగార్జున యూనివర్సిటీ వేదికగా శుక్రవారం జరిగిన ఈ వేడుకలలో నాగార్జున యూనివర్సిటీ రెక్టార్ కె శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ జి. సింహాచలం చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
‘My India: 80 Years of Democracy and Freedom’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ పోటీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నంలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనను అద్భుతంగా చిత్రీకరించిన రాజేష్ ఫొటో ప్రత్యేక గుర్తింపు పొందింది. భారత జాతీయ పతాకంలోని మూడు రంగులను ప్రతిబింబించేలా చిన్నారులు చేసిన ప్రదర్శన, ముందుభాగంలో జాతీయ పతాకం, వెనుకభాగంలో ‘Independence Day Visakhapatnam’ సందేశంతో ఉన్న దృశ్యాన్ని ఆయన కెమెరాలో బంధించారు.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాజేష్‌కు ప్రశంసా పత్రం అందజేశారు. ఫోటోగ్రఫీలో ఆయన సాంకేతిక నైపుణ్యం, జాతీయ స్ఫూర్తి, వృత్తిపరమైన నిబద్ధతను నిర్వాహకులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో PAI కాంటెస్ట్ చైర్మన్ టి. శ్రీనివాసరెడ్డి FRPS, AP State Creativity & Culture Commission చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్. మల్లికార్జునరావు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా చైర్మన్ అండ్ ప్రిన్సిపల్ లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి పోటీలో ‘బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు పొందడం పట్ల కుంచం రాజేష్‌ను పలువురు ఫొటోగ్రాఫర్లు, కళాభిమానులు అభినందించారు.








కామెంట్‌లు (0)