శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్నబ్‌‌పై పూర్తి అప్రమత్తత..

27 అక్టోబర్, 2026

అర్నబ్‌‌పై పూర్తి అప్రమత్తత
జిల్లా కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్
ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలకు ఆదేశం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 07:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జిల్లా కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్

  • ప్రజలకు ఇబ్బందుల్లేకుండా సహాయక చర్యలకు ఆదేశం

ప్రజాశక్తి - నక్కపల్లి : అర్నబ్ తుపాను నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో నక్కపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను పరిస్థితులు, ప్రభుత్వ యంత్రాంగం చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లతో సమీక్షించారు. తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

టెలికాన్ఫరెన్స్‌లో ప్రధానంగా తీర ప్రాంత గ్రామాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండటం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంపై హోంమంత్రి దృష్టి సారించారు. బలమైన గాలుల కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రహదారులు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని హోర్డింగ్స్‌ను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. అవసరమైన చోట సహాయక చర్యలు వేగంగా చేపట్టేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

తుపాను సమయంలో ప్రజలకు సరైన సమాచారం చేరవేయడం అత్యంత ముఖ్యమని హోంమంత్రి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణలేని వార్తలు, వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం, సంబంధిత శాఖలు జారీ చేసే అధికారిక సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్