డాక్టర్ కొండపి నాగేశ్వరరావు హోమియోపతి వైద్య క్రమనిక–2 గ్రంథావిష్కరణ
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ప్రముఖ ఆధ్యాత్మిక, విజ్ఞాన మాసపత్రిక 'మిహిర' 29వ వార్షికోత్సవ వేడుకలు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి.రామ నర్సింహం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం మాస్టర్ ప్రేయర్‌తో ప్రారంభమైంది. ఈ వేడుకలకు కింగ్ జార్జ్ ఆసుపత్రి మాజీ హెచ్‌వోడి డాక్టర్ ధర్మారావు, ఆర్‌ఎస్‌ఎస్ సేవక్ శ్రీరామ్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ హైమావతి, డాక్టర్ శాస్త్రి కుమారుడు శ్రీనివాస్, సచ్చిదానంద, మిహిర వ్యవస్థాపకులు మాస్టర్ ఎంఆర్‌ఎల్ తనయుడు, సంపాదకులు ప్రద్యుమ్న తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా మిహిర బర్త్‌డే స్పెషల్ సంచిక, ఇంగ్లీష్ న్యూ యారా మ్యాగజైన్, ఆన్‌లైన్ వీక్లీ, వాస్తు–ఆస్ట్రాలజీ ప్రత్యేక సంచికలను అతిథులు ఆవిష్కరించారు. అలాగే హోమియోపతి, ఆస్ట్రాలజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కొండపి నాగేశ్వరరావు రచించిన "హోమియోపతి వైద్య క్రమనిక–2" గ్రంథాన్ని డాక్టర్ శాస్త్రి తనయుడు శ్రీనివాస్, డాక్టర్ హైమావతి సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన అతిథులు, మిహిర పత్రిక విజ్ఞాన, ఆధ్యాత్మిక రంగాల్లో సమాజానికి విశేష సేవలు అందిస్తూ విజయవంతంగా 29 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు. డాక్టర్ కొండపి నాగేశ్వరరావు మాస్టర్ ఈ.కె., మాస్టర్ ఎంఆర్‌ఎల్, డాక్టర్ శాస్త్రిల పట్ల చూపిన గురుభక్తి, ఆయన అందించిన నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయమని ప్రశంసించారు. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న ప్రద్యుమ్న, డాక్టర్ ఫణీంద్ర, గణేష్ బాబులను అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ కొండపి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, డాక్టర్ చక్రవర్తి, హనుమంతరావు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.








కామెంట్‌లు (0)