కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబరు 1 నుంచి నిరవధికంగా ఢిల్లీని ఆక్రమిద్దాం అనే నినాదంతో సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఛలో ఢిల్లీకి కార్మిక వర్గం తరలి రావాలని కోరుతూ మంగళవారం సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సరస్వతీ పార్కు నుండి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన విజెఎఫ్ జంక్షన్, డాబా గార్డెన్స్, అంబేద్కర్ విగ్రహం, ఎల్ఐసి, గుడివాడ గురునాథరావు జంక్షన్, ఆర్టిసి కాంప్లెక్స్ ఫ్లైఓవర్, ఆశీలుమెట్ట మీదుగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ మాట్లాడుతూ, ఛలో ఢిల్లీకి విశాఖ నుండి పెద్ద ఎత్తున కార్మికులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్‌లో పెట్టుబడిదారులకు రక్షణ కల్పించే విధంగా చట్టాలు తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని, కానీ దేశంలో సంపదను సృష్టిస్తున్న కార్మికుల చట్టాలను తొలగించి, 4 లేబర్ కోడ్స్‌గా మార్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని, కేవలం యజమానులకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నారని విమర్శించారు. కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎకరం భూమి 99 పైసలకే పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్న ప్రభుత్వం, కార్మికులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించే ఇఎస్ఐ హాస్పటల్ నిర్మాణానికి భూమి కేటాయించకపోవడం వలన దాని నిర్మాణం ఆలస్యమైందన్న సంగతి గుర్తు చేశారు. 2016లోనే ఇఎస్ఐ హాస్పిటల్‌కు శంకుస్థాపన జరిగినా ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోక పోవడానికి కారణం ప్రభుత్వం భూములు కేటాయించక పోవడమే అన్నారు.

విశాఖపట్నం లాంటి నగరాల్లో ఒక కుటుంబం జీవించాలంటే కనీసం రూ.42 వేలు ఆదాయం ఉండాలన్నారు. కానీ అదాని, అంబాని లాంటి కార్పొరేట్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తున్న ప్రభుత్వాలు కార్మికుల జీతాలు మాత్రం పెంచడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు పెంచాలన్నారు. వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, విఒఎ, ఆర్పి వంటి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, సొంత గనులు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. గనులు, అడవులు, నీటి వనరులను ప్రైవేట్ పరం చేయడం ఆపాలని కోరారు. వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా నీటిని వ్యాపారం చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. గతంలో రైతులు, విద్యార్థులు, యువకులు చేసిన పోరాటాల మాదిరిగానే, కార్మికులు కూడా రోడ్లపైకి వచ్చి ఢిల్లీని ముట్టడించి తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ ప్రదర్శనలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పి.వెంకటరెడ్డి, ఎం.సుబ్బారావు, పి.వెంకటరావు, వెంకటలక్ష్మి, లక్ష్మణమూర్తి, కోశాధికారి ఎస్.జ్యోతీశ్వరావు, కార్యదర్శులు పి.మణి, బి.జగన్, నమ్మి రమణ, ఒ.అప్పారావు, అనసూయ, మేరీ, కె.చంద్రశేఖర్, టి.నూకరాజు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)