గ్రామ పంచాయితీ, గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు మున్సిపల్ కార్మికుల్లా జీతాలు ఇవ్వాలని.. బకాయి జీతాలు చెల్లించాలని
కలెక్టరేట్ వద్ద 36 గంటలు నిరసన దీక్ష ప్రారంభం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎపి గ్రామపంచాయితీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మాదిరిగా వేతనాలు చెల్లించాలని,బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 36 గంటలు నిరసన దీక్ష బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ప్రారంభమైంది. దీక్షలను ఉద్దేశించి సి ఐ టి యు నాయకులు సి హెచ్ వెంకటేష్ మాట్లాడుతూ .... సంవత్సరాలు గడుస్తున్నాయి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. మనకు వయస్సు పై బడుతున్నది. అయినా గొర్రె తోక బెత్తెడే అన్నట్లుగా మన వేతనాలు ఉన్నాయన్నారు. మున్సిపాల్టీలలో మనలాంటి పనిచేసే కార్మికులకు రూ.21,000/-ల నుండి 25,000/-ల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. మనకు మాత్రం 2,3 పంచాయితీలు మినహా జిల్లా అంతా రూ.6000/-ల నుండి 10000/-లు మాత్రమే ఇస్తున్నారన్నారు. అది కూడా 4 నెలల నుండి 18 నెలలు వరకు బకాయిలు ఉన్నాయన్నారు. పైగా సంవత్సరానికి ఒకసారి టెండర్ల పేరుతో తొలగిస్తామని నిత్యం బెదిరిస్తున్నారు. వేతనాలు పెంచాలని, వేదింపులు ఆపాలని, టెండర్లు రద్దుచేయాలని పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలనే మొదలగు సమస్యలు పరిష్కారం చేయాలని గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గా డిమాండ్ చేస్తున్నామన్నారు.మనందరం ఐక్యంగా లేకపోవడంతో వీళ్ళది ఏముందిలే అనే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వంలోను, అధికారులలోను ఉన్నది. మన బతుకులు మారాలన్నా, వేతనాలు పెరగాలన్నా మనందరం ఐక్యంగా ప్రభుత్వం తో పోరాడాలి. తిరగబడి పోరాడారు కాబట్టే మన లాంటి పనిచేసే మున్సిపల్ కార్మికులకు ఈ రోజు వేతనాలు రూ.25 వేల వరకు వస్తున్నాయి. అదేరకమైన పనిచేసే మనకు మాత్రం ముష్టి విదిలించినట్లుగా రూ.6,7 వేలు వేతనాలు ఇస్తున్నారు. మనకు వేతనాలు పెరగాలంటే పోరాటం చేయాల్సిందేనన్నారు. గ్రామ పంచాయితీ కార్మికుల పోరాటఫలితంగా 1999లో ప్రభుత్వం జారీచేసిన జీవో ఎంఎస్ నెంబర్. 551 లో పంచాయితీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, అమలు చేయాలని వీటితోపాటు టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. కార్మికులకు ఉపయోగపడే పథకాలన్నీ గత 27 ఏళ్ళగా ప్రభుత్వాలు గాలికి వదిలేశాయి. కానీ కార్మికుల మెడకు ఉచ్చు బిగించే టెండర్ల విధానం మాత్రం బలవంతంగా అమలుచేస్తున్నారు. ఎన్ఎంఆర్ లకు జిఓ నెంబర్ 142 ప్రకారం ప్రభుత్వం జీతాలు చెల్లిస్తున్నది. కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడంలేదు. డిఎ వర్తింపచేయడం లేదన్నారు. తక్షణమేమున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా పంచాయితీ కార్మికులు, ఎన్ఎంఆర్, గ్రీన్ అంబాసిడర్లకు రూ.21,000/-໙, రూ.21,500/- ఇవ్వాలన్నారు. ప్రతి నెల 5 వ తేది లోపు జీతాలు ఇవ్వాలి, బకాయి జీతాలు వెంటనే చెల్లించాలన్నారు.టెండర్లకు సంబంధించి హైకోర్టు తీర్పులు అమలుచెయ్యాలనీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీచేసిన 132,142 జీఓలను పక్కాగా అమలు చెయ్యాలనీ,కార్మికులందరికీ గుర్తింపుకార్డులు, ఇపిఎఫ్, ఇఎస్ఐ, గ్రాట్యూటీ పెన్షన్, సెలవులు అమలుచెయ్యాలనీ, దహన సంస్కారాలకు రూ.20,000/-లు చెల్లించాలనీ, సాధారణమృతికి 5లక్షల రూపాయలు, ప్రమాద మృతులకు రూ.10 లక్షలు ఎక్స్రేషియో చెల్లించాలి. కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలనీ ఆయన డిమాండ్ చేశారు.దీక్షలో కార్మికులు అప్పారావు,గురమ్మ ,సముద్రం,బాబులు,రాములు,పైడిరాజు,సూరి,నాగరాజు కూర్చున్నారు. దీక్షలు ప్రారంభం లో సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు.వి.లక్ష్మీ,బి.సూర్యనారాయణ, కోశాధికారి ఏ జగన్మోహనరావు, ముత్యాలు పంచాయితీ కార్మికులు,గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)