ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విద్యారంగంలో 16 ఏళ్లుగా సేవలందిస్తూ, విద్యార్థుల విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న కొత్తపల్లి గణేశ్వరరావు, సెకండరీ గ్రేడ్ టీచర్, ఎం సి హెచ్ ఎస్ , కస్పా, విజయనగరం, కు గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ 2026లో భాగంగా ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. గుంటూరు మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోని ఆడిటోరియంలో 13 సెప్టెంబర్ 2026న నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో గణేశ్వరరావు గారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, విద్యారంగ నిపుణులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించినట్లు టీచర్స్ హబ్ ఇండియా ఆధ్వర్యంలోని నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమాలు ....
కొత్తపల్లి గణేశ్వరరావు గారు తన 16 ఏళ్ల ఉపాధ్యాయ సేవలో విద్యార్థుల్లో గణితం, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించేందుకు పలు విద్యా కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా మ్యాథ్స్ క్లబ్, మ్యాథ్స్ మేళా, సైన్స్ ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలను విజయనగరం మండల, జిల్లా స్థాయిలో నిర్వహించి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించినట్లు ఆయన పేర్కొన్నారు.
పేద విద్యార్థులకు ఉచిత విద్యా సహాయం ....
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల విద్యాభివృద్ధికి కూడా ఆయన తన వంతు సేవలను అందిస్తున్నారు. అవసరమైన విద్యార్థులకు ఉచిత విద్యా మార్గదర్శకత్వం, పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందించడం ద్వారా వారి విద్యా అవకాశాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గతంలోనూ పలు పురస్కారాలు ....
గణేశ్వరరావు గారు గతంలో ఉత్తమ ఉపాద్యాయ అవార్డు, గురు స్పందన పురస్కారం, పాన్ ఇండియా ఐకానిక్ అవార్డ్ వంటి పురస్కారాలు అందుకున్నటు పేర్కొన్నారు. తాజాగా లభించిన గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ 2026 ఆయన విద్యా సేవలకు మరో గుర్తింపుగా నిలిచింది.టీచర్స్ హబ్ ఆఫ్ ఇండియా గ్లోబల్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ 2026 కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా అవార్డు సభ్యులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యారంగంలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, విద్యా నిపుణులను గుర్తించి సత్కరించే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టీచర్స్ హబ్ ఇండియా నిర్వాహకులు పేర్కొన్నారు. గణేశ్వరరావు గారికి లభించిన ఈ పురస్కారం పట్ల విజయనగరం *జిల్లా విద్య శాఖ అధికారి వారు, మండల విద్యాశాఖ అధికారి వారు, మరియు జిల్లా ఉపాధ్యాయులు సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎస్ ఎం సి చైర్మన్ మరియు వారి బృందం హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.








కామెంట్‌లు (0)