జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి సమీక్ష
ప్రజాశక్తి .. విజయనగరం టౌన్
ఆదివారం నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విజయనగరంలోని గాజులరేగ అయాన్ డిజిటల్ జోన్లో నీట్ పీజీ - 2026 ప్రవేశ పరీక్ష జరగనుంది. జిల్లాలో మొత్తం 475 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులు ఉదయం 7 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద బి ఎన్ ఎస్ ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎలాంటి సమూహాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని సూచించారు. పరీక్ష కేంద్రం వద్ద ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మహిళా వైద్యురాలిని అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఉదయం 7 గంటల నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారు లకు సూచించారు. పరీక్షకు ముందు రోజు పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి అభ్యర్థులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యేలా చూడాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. పరీక్ష రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇంచార్జి డీఆర్వో అరుణకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)