- రాష్ట్ర రైతాంగ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బలరాం
ప్రజాశక్తి-భీమవరం : అఖిలభారత కిషన్ సభ(ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్ సభ్యునిగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. బలరాం ఎన్నికయ్యారు.ఈనెల 15 నుండి 18వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం నల్లగొండలో అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్ 36 జాతీయ మహాసభలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా 167 మందితో జాతీయ కౌన్సిల్, 87 మందితో కేంద్ర కిసాన్ కమిటీని, 27 మంది ఆఫీస్ బేరర్స్ గా కమిటీ ఎన్నికయింది. ఈ కమిటీలోకి జిల్లాకు చెందిన బి.బలరాం జాతీయ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు. బలరాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, రాష్ట్రం విడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన బలరాం పలు రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించాలని అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని , రైతుల రుణమాఫీ చేసి రైతులు కౌలు రైతుల ఆత్మహత్యలు నివారించాలని , రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి రైతులను భూమిలేని కూలీలుగా మార్చవద్దని మహాసభ తీర్మానించినట్లు బలరాం తెలిపారు. గ్రామీణ, పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలని కార్మికుల హక్కులు కాపాడాలని మహాసభ కోరింది. ఎరువులు, పురుగుమందులు,పెట్రోల్, డీజిల్, ఔషధాలు, నిత్యవసర వస్తువులు, గ్యాస్ ధరలు, కరెంటు చార్జీలు తగ్గించాలని తీర్మానించింది. రాబోయే రోజుల్లో రైతులు కౌలు రైతుల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళనలు చేపట్టాలని మహాసభ నిర్ణయించింది. ఈ నెల 26న దేశవ్యాప్తంగా రైతు సమస్యలపై ఆందోళనలు, డిసెంబర్1,2,3 తేదీల్లో ఢిల్లీలో జరిగే కార్మిక నిరవధిక మహాధర్నాకు మహాసభ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మహాసభలకు దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1000 మంది పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా తిరిగి అశోక్ ధావలె, విజు కృష్ణన్ ఎన్నికయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి ఆల్ ఇండియా సహాయ కార్యదర్శిగా కే ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారన్నారు. సికేసి సభ్యులుగా వి కృష్ణయ్య, ఎం హరిబాబు ఎన్నికయ్యారు. కౌన్సిల్ కు మరో సభ్యునిగా ఎం.సూర్యనారాయణ ఎన్నికయ్యారు. మహాసభ ప్రారంభం రోజున లక్ష మందితో బ్రహ్మాండమైన రైతు ప్రదర్శన బహిరంగ సభ జరిగిందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అగ్రి ఫెస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలను వేలాదిమంది తిలకించారని పేర్కొన్నారు.







కామెంట్లు (0)