గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రయివేటు విద్యుత్ ఒప్పందాలను సమీక్షించి, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి

45 నిమిషాల క్రితం

vsr cm chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 01:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్

ప్రజాశక్తి - విజయవాడ: ప్రయివేటు విద్యుత్ వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం వస్తున్నదని చందబ్రాబునాయుడు స్వయంగా ఒప్పుకోవడం వారి విధానాల వైఫల్యానికి నిదర్శనమని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటికైనా అధిక రేట్లతో అడ్డగోలుగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించి కూటమి ఎన్నికల వాగ్దానానికనుగుణంగా విద్యుత్ చార్జీలు తగ్గించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం విద్యుత్ రంగంపై ఆ శాఖ అధికారులతో సమీక్ష చేస్తూ “విద్యుత్ అవసరాలకోసం ప్రయివేటు సంస్థలపై ఆధారపడటం తగ్గించాలని, ప్రణాళికాబద్దంగా ప్రభుత్వ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని” చంద్రబాబు చెప్పడం వామపక్ష విధానాలకు విజయమని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ తీరు మార్చుకోవాలని కోరారు.

గత రెండున్నర దశాబ్దాలుగా ఒక పథకం ప్రకారం ప్రభుత్వ రంగంలో విద్యుత్ ఉత్పత్తిని దెబ్బకొడుతూ ప్రయివేటు కంపెనీలతో ఇబ్బడిముబ్బడిగా తప్పుడు ఒప్పందాలు (పిపిఎ) చేసుకున్న దుష్పలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నామని తెలిపారు. విద్యుత్ సంస్కరణలకు ఆద్యుడిగా తనకుతాను సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్న చంద్రబాబు నాయుడు ఆ సంస్కరణల ఫలితంగానే విద్యుత్ రంగానికి ఈనాడీ దుస్థితి దాపురించిందన్న వాస్తవాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో విద్యుత్ ఒప్పందాలకు వ్యతిరేకంగా వామపక్షాలు చేసిన మహా పోరాటాన్ని రక్తపుటేరుల్లో ముంచిన ఘనత చంద్రబాబునాయుడుదని తెలిపారు. ఆ పోరాట ఫలితంగానే దీర్ఘకాలం విద్యుత్ ఛార్జీలు పెంపుదల నిలిచిపోయిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెచ్చించి ప్రయివేటు కంపెనీలకు భారీగా ఛార్జీలు చెల్లిస్తూ వచ్చారని మండిపడ్డారు. దీనికి పరాకాష్ట అదానీ కంపెనీతో జరిగిన సోలార్ విద్యుత్ ఒప్పందమని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రూ.1,740 కోట్లు లంచం ఇచ్చి యూనిట్‌కు రూ.2.49ల చొప్పున 25 సంవత్సరాలపాటు చేసుకున్న అక్రమ ఒప్పందాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కూడా రద్దు చేయకుండా కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. నాడు తెలుగుదేశం దీనిపై కోర్టులో కేసు వేసిందని, ఇప్పటికీ అది పెండింగ్‌లో ఉందని తెలిపారు. పైగా అది ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నదని పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిపై పోరాటం చేస్తామని, ఆయన విధానాలు రాష్ట్రాన్ని విధ్వంసంవైపు నడిపించాయని పదే పదే చెబుతున్న చంద్రబాబునాయుడు వాటినే కొనసాగించడంపై ఇప్పటికీ నిజాయితీతో వివరణ ఇవ్వలేదని తెలిపారు. మోడీ, అమిత్‌షా ఒత్తిడిపై అదానీకోసమే ఈ ఒప్పందాలను కొనసాగిస్తున్నారు తప్ప రాష్ట్రంకోసం కాదని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలనే కొనసాగిస్తూ ఆయనపై పోరాడటమంటే పదవులకోసమే తప్ప ప్రజలకోసం కాదని రుజువవుతున్నదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఏమాత్రం నిజాయితీ, చిత్తశుద్ది ఉన్నా ఇచ్చిన హామీ ప్రకారం ప్రయివేటు విద్యుత్ ఒప్పందాలన్నింటినీ సమీక్షించి తక్షణం బేస్ లెవల్‌కు చార్జీలు తగ్గించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్