వరల్డ్ స్పేస్ వీక్ సందర్భంగా ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహణ
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆనం కళాకేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తల చేతుల మీదుగా బహుమతులు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం : ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల (వరల్డ్ స్పేస్ వీక్) సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో శనివారం మండల స్థాయి రాతపూర్వక క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి ఎం.వి.ఎం సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2:00 గంటల నుండి 2:30 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నామని అన్నారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 8, 9, 10 తరగతులకు చెందిన విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని, ప్రతి పాఠశాల నుంచి ఒక విద్యార్థి మాత్రమే ఈ పోటీకి హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఈ క్విజ్ పోటీ 30 మార్కులకు, 30 ప్రశ్నలతో, 30 నిమిషాల వ్యవధిలో రాతపూర్వకంగా నిర్వహించబడుతుందని, ఈ పోటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల నుంచి ఇద్దరు, ప్రైవేటు పాఠశాలల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ఎంపికైన విద్యార్థులకు అక్టోబర్ 8, 9 తేదీల్లో రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహించే అంతరిక్ష వారోత్సవాల ముగింపు వేడుకల్లో ఇస్రో శాస్త్రవేత్తల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారని ఆ ప్రకటన లో తెలిపారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో కోరారు.








కామెంట్లు (0)