ముంబయి : విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (ఎఫ్ఆర్ఆర్ఒ) జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ నటుడు ఇమ్రాన్ఖాన్ ఆదివారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 28 నాటికి భారత్ను విడిచి వెళ్లాలంటూ ఎఫ్ఆర్ఆర్ఒ ఇచ్చిన నోటీసులు ఏకపక్షం, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. న్యాయవాది జుల్ఫికర్ మెమన్ నేతృత్వంలోని న్యాయబృందం సోమవారం హైకోర్టులో ఈ అంశాన్ని ప్రస్తావించి, అత్యవసర విచారణ కోరే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అక్టోబర్ 14 నాటి నోటీసును కొట్టివేయాలని ఇమ్రాన్ ఖాన్ తన పిటిషన్లో కోరారు. తాను ఉల్లంఘించానని ఆరోపించిన ఇమ్మిగ్రేషన్ ,విదేశీయుల చట్టం 2025లోని నిబంధనలేమిటో నోటీసుల్లో పేర్కొనలేదని ఆయన వాదించారు. కారణం చూపమని నోటీసు ఇవ్వకుండా లేదా విచారణకు అవకాశం కల్పించకుండా ఈ నోటీసు జారీ చేశారని కూడా ఆయన వాదించారు. పిటిషన్ ప్రకారం, ఖాన్ 2006 నుండి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను కలిగి ఉన్నారని, సుమారు రెండేళ్ల వయస్సు నుండి భారతదేశంలో నివసిస్తున్నారని పేర్కొంది. భారతదేశంతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని నొక్కి చెప్పడానికి, దేశంలోని తన విద్య, వృత్తిపరమైన పని, కుటుంబ సంబంధాలను ఆయన ఉదహరించారు. అక్టోబర్ 15న ఇమ్రాన్ ఖాన్కు నోటీసు అందిందని, అక్టోబర్ 28లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారని పిటిషన్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఉల్లంఘించినట్లు ఆరోపించిన నిర్దిష్ట చట్టపరమైన నిబంధనలను ఆ నోటీసులో పేర్కొనలేదని, ఆదేశం జారీ చేసేటప్పుడు అధికారులు పరిగణనలోకి తీసుకున్న సమాచారం వివరాలను అందించలేదని పిటిషన్ వాదించింది.








కామెంట్లు (0)