ప్రజాశక్తి - నరసాపురం
వశిష్ఠ గోదావరిలో చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడి కొట్టుకువస్తుండటంతో నరసాపురం ప్రాంతంలో ఆందోళన నెలకొంది. గోదావరి స్నాన ఘాట్ల వద్దకు చనిపోయిన చేపలు భారీగా చేరడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వస్తోంది. దీంతో నదీ తీరంలో నిలబడలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా ఫ్యాక్టరీల నుండి వస్తున్న రసాయనాలు నుంచి విడుదలవుతున్న వ్యర్థాలే చేపల మృతికి కారణమని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరిలో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోతున్నాయని, అరుదైన చేపల జాతులు సైతం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జులై నెలలోనూ కొన్ని చేపలు చనిపోయి నదీ తీరానికి కొట్టుకువచ్చాయని మత్స్యకారులు గుర్తుచేస్తున్నారు. గోదావరిలో చేపల మృతికి అసలు కారణాలను అధికారులు గుర్తించాలని, నీటి నాణ్యతను పరీక్షించి కాలుష్యానికి కారణమవుతున్న వాటిపై విచారణ చేపట్టాలని మత్స్యకారులు, స్థానికులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చేపల మృతిని అరికట్టడంతోపాటు గోదావరి జలాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చనిపోయిన చేపలను పరిశీలించిన ఎమ్మెల్యే
గోదావరిలో పెద్దసంఖ్యలో చేపలు మృత్యువాత పడటంపై నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, మత్స్యకార అభివృద్ధి ఛైర్మన్ కొల్లు పెద్దిరాజుతో కలిసి పడవపై గోదావరిలోకి వెళ్లి మృతి చెందిన చేపలను పరిశీలించారు. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. చేపల మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరిలో చేపలు మృత్యువాత పడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ ఘటనతో నష్టపోయే మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గోదావరిలోకి కలుషిత నీటిని విడుదల చేస్తూ జలవనరులను, జలచరాలను దెబ్బతీసే కంపెనీలపై విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.






కామెంట్లు (0)