చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెంటనే రాజీనామా చేయాలి
విద్యార్థులపై లాఠీఛార్జ్, అక్రమ అరెస్టుల పట్ల ఆగ్రహం
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం : కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని సిఐటియు జిల్లా నేతలు కర్రి నాగేశ్వరరావు, కరెడ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. వామపక్షాల పిలుపు మేరకు సోమవారం స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కును పరిరక్షించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారన్న ఆరోపణలపై పారదర్శక దర్యాప్తు జరిపి ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై అక్రమ అరెస్టులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు, ఓటు హక్కు రక్షణకు ప్రజలు, కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు సత్తి కోదండరామిరెడ్డి, చిటికిన రాము, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, దేశంశెట్టి సతీష్, శిద్దిరెడ్డి శేషుబాబులతో పాటు అపరాల మార్కెట్ జట్టు కార్మికులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)