కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతి బాబు, సత్యనారాయణ
భీమవరం కలెక్టరేట్ వద్ద సామాజిక శంఖారావం ధర్నాలో నేలపై బైఠాయించి దళితులు నినాదాలు
ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : స్వతంత్రం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా దళితులు ఆత్మగౌరవం కోసం నేటికీ పోరాడడం పట్ల ప్రభుత్వ పాలకులు సిగ్గుపడాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతి బాబు, వ్యవసాయ కార్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ విమర్శించారు. భీమవరం కలెక్టరేట్ వద్ద కేబీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సామాజిక శంఖారావం ధర్నా కు జిల్లా నలుమూల నుంచి దళితులు వేలాదిగా తరలివచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణంలో నేలపై బైఠాయించి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా క్రాంతి బాబు, సత్యనారాయణ మాట్లాడుతూ దళితులు ఎదుర్కొనే కులవివక్ష, అంటరానితనం వంటి అమానుషమైన రూపాలు, దళితులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై కేవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో 20 మండలాలు, 6పట్టణాల్లో సామాజిక శంఖారావం చేపట్టినట్లు తెలిపారు. 150 గ్రామాల్లో, దాదాపుగా 250దళిత పేటల్లో ఈ సర్వే చేసినట్లు చెప్పారు. దళితులు పుట్టినప్పటినుంచి వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారని, ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా 6అడుగుల నేల కోసం కూడా పోరాడటం అంటే పాలకులు సిగ్గుపడాలన్నారు. 80ఏళ్ల స్వాతంత్ర్యంలో కూడా దళితులు అభివృద్ధికి దూరంగానే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 80శాతం దళిత పేటలకు స్మశాన వాటికలు లేవని, ఉన్న 20శాతం స్మశాన వాటికలు ఆక్రమణకు గురయ్యాయని తెలిపారు. దళితులకు సోలార్ ఉచిత విద్యుత్ పథకం అంతా బూటకమని దుయ్యబట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో దళిత వాడల అభివృద్ధి జిల్లాలో కనుమరుగయ్యిందన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. డ్రైనేజీ, సిసిరోడ్లు, విద్యుత్ లైట్లు వంటి కనీస మౌలిక వసతులు కూడా లేవన్నారు. సోలార్ ఉచిత విద్యుత్ పేరుతో దళితుల ఇళ్లకు ఉచిత సోలార్ ప్యానెల్ అమర్చారని కానీ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా ఆ విద్యుత్ ను బయటికి తరలిస్తున్నారు తప్ప దళితులకు ఉపయోగం లేదన్నారు. ఈ ధర్నాలో కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల నేతలు దళితులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)