ప్రజాశక్తి- ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : విజయవాడలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్ ), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ( ఏపీవీకేఎస్ ) ఉమ్మడి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సామాజిక శంఖారావం’ మహాధర్నాతో సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణ దద్దరిల్లింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దళిత, గిరిజన పేటల్లో నిర్వహించిన విస్తృత క్షేత్రస్థాయి సర్వేల ద్వారా సేకరించిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం వందలాదిగా తరలివచ్చిన బాధితులు, ప్రజాసంఘాల నాయకులతో కలెక్టరేట్ వద్ద ఆందోళనలు ఉధృతంగా సాగింది. దళితుల అభ్యున్నతికి తోడ్పడాల్సిన ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను కేటాయించడంలో, విడుదల చేయడంలో పాలకులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని దళిత నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా నేటికీ అనేక దళిత పేటలకు తాగునీరు, సరైన రోడ్లు, వీధిదీపాలు, అంతర్గత మరుగుదొడ్లు కరువయ్యాయని, ఎవరైనా మరణిస్తే కనీసం గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి స్మశాన స్థలాలు కూడా లేని దయనీయ స్థితి కొనసాగుతుండటంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దళితుల స్మశాన భూములను తక్షణమే కేటాయించి వాటిలో మౌలిక వసతులు కల్పించాలని, గతంలో ఇచ్చిన జీవో 1235ను తక్షణమే క్షేత్రస్థాయిలో అమలు చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. అలాగే భూ సమస్యలపై జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిషన్ చేసిన చారిత్రాత్మక సిఫారసులను ప్రభుత్వం పూర్తిగా అమలు చేయాలని, జలజీవన్ మిషన్ కింద ప్రతి దళిత ఇంటికీ ఉచితంగా కుళాయి మంచినీటి సరఫరాను అందించాలని కోరారు. విజయవాడ నగర పరిధిలో ఇళ్లు లేక అద్దె ఇళ్లల్లో మగ్గుతున్న నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు, శాశ్వత పట్టాలు ఇవ్వడంతో పాటు, గతంలో విద్యా సంస్కరణల పేరుతో దళిత పేటల్లో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల స్కాలర్‌షిప్ మెస్ ఛార్జీలను భారీగా పెంచాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకాన్ని పునరుద్ధరించి అర్హులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, సుదీర్ఘ కాలంగా న్యాయం కోసం పోరాడుతున్న దళిత క్రైస్తవులకు చట్టబద్ధమైన ఎస్సీ హోదా కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వి.కృష్ణ, సిఐటియు జిల్లా కార్యదర్శి కే. సుబ్బరావమ్మ, ఐదవ కార్యదర్శి శ్రీదేవి, రైతు కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు కోట కళ్యాణ్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు క్రాంతి, ఇతర ప్రజా సంఘల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విజయవాడలో ‘సామాజిక శంఖారావం’ గర్జన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 24, 2026, 04:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)