శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అప్రకటిత నీటి విడుదలపై రజకులు ఆగ్రహం

17 నవంబర్, 2026

అప్రకటిత నీటి విడుదలపై రజకులు ఆగ్రహం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-దేవరాపల్లి

రైవాడ జలాశయం నుంచి శారదా నదిలోకి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నీటిని విడుదల చేయడంపై దేవరాపల్లి రజకులు మంగళవారం శారదా నదిలో నిరసన తెలుపుతూ, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం అధికారులు అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడంతో నదిలోని చాకిరేవుల వద్ద ఉన్న బట్టలు, చాకిరేవు బల్లలు, దోబీ పనులకు వినియోగించే సామగ్రి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయని 20 రజక కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జలాశయం నుంచి నీటిని విడుదల చేసే సమయంలో సైరన్ మోగించడంతోపాటు దండోరా వేయించి, రెవెన్యూ సిబ్బంది ద్వారా నదీ పరివాహక ప్రాంత ప్రజలకు సమాచారం అందించేవారని తెలిపారు. ఈసారి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నీటిని విడిచిపెట్టడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఆ సమయంలో నదిలో మనుషులు ఉండి ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు జరిగిన నష్టంపై వివిధ శాఖల అధికారులు బాధ్యత తీసుకోకుండా ఒకరిపై మరొకరు నెపం నెడుతున్నారని ఆరోపించారు. ప్రజల జీవనోపాధికి సంబంధించిన అంశంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇకపై జలాశయం నుంచి నీటిని విడుదల చేసే ముందు తప్పనిసరిగా సైరన్ మోగించి, దండోరా వేయించి, సంబంధిత ప్రాంతాల ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని కోరారు. తమకు జరిగిన నష్టాన్ని అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని రజక కుటుంబాల వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్