ఆమంచి కృష్ణమోహన్ ఇంటి వద్ద మారణాయుధాలతో సంచరించిన వ్యక్తులపై సమగ్ర విచారణ జరపాలి.
– ఆయనకు తగిన భద్రత కల్పించాలి
- డీసీసీ అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి డిమాండ్
ప్రజాశక్తి - కడప : ఆమంచి కృష్ణమోహన్ ఇంటి వద్ద మారణాయుధాలతో సంచరించిన వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి, ఆయనకు తగిన భద్రత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నివాసం వద్ద క్రిమినల్ చరిత్ర కలిగిన కొంతమంది వ్యక్తులు మారణాయుధాలతో అనుమానాస్పదంగా సంచరించడమే కాకుండా, వారిని ప్రశ్నించిన స్థానికులపై కత్తులతో దాడికి యత్నించిన ఘటన అత్యంత దారుణమని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అరాచకాలకు, బెదిరింపులకు, హింసాత్మక చర్యలకు ఏమాత్రం తావు లేదని ఆమె స్పష్టం చేశారు. చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.ఈ ఘటనను జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, దీనిపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు.అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు, ఆయన కుటుంబ సభ్యులకు తగిన పోలీసు భద్రత కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాజకీయ కక్షసాధింపు చర్యలతో ప్రజాస్వామ్య గొంతుకలను అణచివేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ సహించబోదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఎన్.డి. విజయ జ్యోతి హెచ్చరించారు.







కామెంట్‌లు (0)