ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, పట్టించుకోని పాలకులు, పార్లమెంటు, శాసనసభ్యులు : సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
విజయవాడ : రాష్ట్రం నడిబొడ్డున వాంబే కాలనీ వద్ద రైల్వే బ్రిడ్జి లేక ప్రజలు నరకయాతనపడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు అన్నారు. శుక్రవారం బాబురావు, సిపిఎం నగర కమిటీ సభ్యులు ఎస్కే. పీర్ సాహెబ్ , మహిళా నేత రత్నకుమారి తదితరులతో కలిసి వాంబే కాలనీ రైల్వే లైన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు. రైల్వే లైన్ దాటి ప్రయాణిస్తున్న అనేక మందితో మాట్లాడి, వారి కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ .... రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడలో, వాంబే కాలనీలో బ్రిడ్జి లేక ప్రజలు నరకయాతన పడుతుంటే, కనీసం మానవత్వం లేకుండా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం ప్రదర్శించటం దుర్మార్గమన్నారు. ఒట్టి మాటలు కట్టిపెట్టి, పార్లమెంటు, శాసనసభ్యులు నిధులు మంజూరు చేయించండి, రైల్వే బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించే చర్యలు చేపట్టండి అని కోరారు. విజయవాడ నగరం పైన, పేదల పైన.. కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఈ చిన్న చూపు ? అని ప్రశ్నించారు. డబుల్, త్రిబుల్ ఇంజిన్ ప్రభుత్వంగా చెప్పుకునే.. కూటమి నేతలు ఎందుకు రైల్వే శాఖ ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతులు పొందలేకపోతున్నారు, నిధులు మంజూరు చేయించలేకపోతున్నారు. ప్రమాదాలలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా నేతలకు పట్టదా ? అని అడిగారు. వాంబే కాలనీ వద్ద రైల్వే బ్రిడ్జి, అజిత్ సింగ్ నగర్ లో రెండవ ఫ్లైఓవర్ కు తక్షణమే నిధులు మంజూరు చేయాలన్నారు. కేంద్రంలో 12 ఏళ్లుగా బిజెపి, ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రములో రెండున్నర సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం.. అధికారంలోనే ఉన్నా విజయవాడ నగరంలో మౌలిక సదుపాయాలు కల్పనలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. తాజాగా నగరపాలక సంస్థ లో అధికారం దక్కించుకున్న కూటమి నేతలు కూడా ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఒత్తిడి తేవాలని కోరారు. స్థానిక ప్రజలు.. బ్రిడ్జి నిర్మాణానికి నేతలను నిలదీయండి, భవిష్యత్తు ఉద్యమానికి సిద్ధం కండి అని పిలుపునిచ్చారు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోరుతూ.. సిపిఎం గతం నుండి అనేక ఆందోళనలు చేపట్టింది, భవిష్యత్తులోను స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఆందోళన కొనసాగిస్తామని బాబూరావు అన్నారు.







కామెంట్‌లు (0)