క్రీడలు : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ స్మృతి మంధాన తన బ్యాటింగ్ నైపుణ్యంతో మరోసారి ఆకట్టుకుంది. ప్రత్యర్థి విసిరిన సవాలును స్వీకరించి, బంతి వేగం పెరుగుతున్న కొద్దీ తన ఆటతీరును మరింత పదును పెట్టింది. చివరకు కేవలం 37 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ఔరా అనిపించింది. అయితే ఈ సంచలన ఇన్నింగ్స్ అంతర్జాతీయ మ్యాచ్‌లో చేసింది కాదు.. ఓ ప్రత్యేక క్రికెట్ ఛాలెంజ్‌లో భాగంగా సాధించింది.
ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్ ‘స్విచ్’ నిర్వహించే షోలో మంధాన పాల్గొంది. ఈ కార్యక్రమంలో బ్యాటర్‌కు 50 బంతుల్లో 100 పరుగులు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. తొలి బంతి గంటకు 51 మైళ్ల వేగంతో దూసుకొస్తే, ఆ తర్వాత ప్రతి బంతి వేగం గంటకు ఒక మైలు చొప్పున పెరుగుతుంది. చివరి బంతి గంటకు 100 మైళ్ల వేగంతో వస్తుంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. అయినప్పటికీ మంధాన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పెరుగుతున్న బంతి వేగాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ, తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడింది. 50 బంతుల్లో శతకం చేయాలన్న సవాలును 37 బంతుల్లోనే అధిగమించింది. గతంలో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.
ప్రస్తుతం స్మృతి మంధాన దేశవాళీ క్రికెట్‌లో బిజీగా ఉంది. సీనియర్ మహిళల ఇంటర్‌జోనల్ టీ20 టోర్నీలో వెస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న భారత మహిళల జట్టు అక్కడ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబర్ 9న గెబెర్హాలో ఏకైక టెస్టు మ్యాచ్‌తో పర్యటన ప్రారంభం కానుంది. అనంతరం డిసెంబర్ 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. టీ20 సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 26న తొలి మ్యాచ్, 29న రెండో మ్యాచ్, 30న చివరి మ్యాచ్ నిర్వహించనున్నారు.
భారత మహిళల జట్టు : స్మృతి మంధాన (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, స్నేహ రాణా, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, రిచా ఘోష్, నందనీ శర్మ, ప్రతీకా రావల్, సయాలీ సత్‌ఘరే, క్రాంతి గౌడ్, జింటిమని కలిటా, శ్రీ చరణి.







కామెంట్‌లు (0)