ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మోసంతో వృద్ధురాలి ఆస్తి కాజేసిన బంధువులు

14 నవంబర్, 2026

Relatives swindle elderly woman out of her property through deception
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 02:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆ పై దాడులు, బెదిరింపులు..

న్యాయం చేయాలని వృద్దురాలి వేడుకోలు


ప్రజాశక్తి-రాజంపేట (కడప) : ఆమె ఒంటరి వృద్ధురాలు. సంతానం లేదు. భర్త అనారోగ్యంతో మరణించాడు. ఆమె కూడా ఇటీవల అనారోగ్యంతో మంచాన పడటంతో ఆమె దూరపు బంధువులు చికిత్స ఇప్పించే నిమిత్తం దగ్గరై సుమారు రూ. 10 లక్షలు నగదు, 5 తులాల బంగారం కాజేశారని, ఆసుపత్రిలో ఐసీయూలో ఉండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తామని మోసం చేసి ఆస్తి పత్రాలపై వేలిముద్రలు తీసుకున్నారని డి.బి.ఎన్ పల్లె చెర్రీస్ పాఠశాల వద్ద నివాసం ఉండే నాగినేని నాగమ్మ ఆరోపించారు. శనివారం ప్రజాశక్తితో ఆమె తన గోడును వెళ్లబోసుకున్నారు.


తనకు జరిగిన అన్యాయంపై ఆమె పాత్రికేయులను ఆశ్రయించి బోరుమని విలపించారు. ఈ సందర్భంగా నాగమ్మ మాట్లాడుతూ ... ఇటీవల తాను అనారోగ్యం బారినపడటంతో తన దూరపు బంధువులైన ఆకేపాడు బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన జెట్టి మల్లిఖార్జున, రాజంపేట సాయి నగర్ లో ఉంటూ తిరుపతిలో మెడికల్ రెప్రజెంటేటివ్ గా పనిచేసే తిమ్మిగారి నరేంద్ర లు తనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స నిమిత్తం రూ.10 లక్షలు నగదుతోపాటు 5 తులాల బంగారాన్ని అపహరించినట్లు తెలిపారు. అంతేకాకుండా తాను ఐసీయూలో ఉండగా సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోవాలన్న నెపంతో తన వద్ద ఆస్తి పత్రాలపై వేలిముద్రలు తీసుకొని వారి పేరిట రాయించుకున్నారని, తనకు చికిత్స పూర్తికాకముందే ఇంటికి తీసుకువచ్చి అనాధగా వదిలి వెళితే తన అన్న కుమారుడు నాగరాజ తన ఆలనా, పాలన చూసుకోవడంతో కోలుకున్నానని తెలిపారు. తనకు చేదోడుగా నిలిచిన తన మేనల్లుడు నాగరాజ కు ఆస్తి బాధ్యతలు అప్పగించగా మల్లిఖార్జున, నరేంద్ర లు ఆస్తి తమ పేరిట ఉన్నదని చెబుతూ ఇంటి పైకి దాడికి వచ్చారని, అడ్డుగా వచ్చిన తన మేనల్లుడు నాగరాజ పై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశామన్నారు. అయినప్పటికీ వారు బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారని, ఒంటరి వృద్ధురాలు అయిన తనకు వారి నుండి ప్రాణహాని ఉందని, వారి నుండి రక్షణ కల్పించడంతోపాటు మోసంతో కాజేసిన తన ఆస్తిని తనకు ఇప్పించాలని అధికారులను కోరుతూ ఆమె వేడుకున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్