ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాఠశాలల సోషల్ ఆడిట్ వాయిదా వేయాలి : డిఆర్ఓ, డిఇఓ, ఎస్ఎస్ఎ ఏపీసీలకు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక వినతి

14 నవంబర్, 2026

Social audit of schools should be postponed Teachers Unions Joint Forum submits request to DRO DEO and SSA APCs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 04:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కడప అర్బన్ : ఒకవైపు పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యాంకన పరీక్షల నిర్వహణ, మరోవైపు పంచాయతీ ఎన్నికల శిక్షణా తరగతులు, విధుల నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో సోషల్ ఆడిట్ నిర్వహణకు షెడ్యూల్ ఇవ్వటం తగదని, ఈ షెడ్యూల్ ను తక్షణమే వాయిదా వేయాలని కడప జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిఆర్ఓ కె.మల్లికార్జునుడు, డీఈవో షేక్.షంషుద్దీన్, ఎస్ఎస్ఏ ఏపీసి ఎం.అనురాధ కు విజ్ఞప్తి చేసింది. శనివారం కడప జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.పాలకొండయ్య, ఏపీటీఎఫ్ (1938) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.అబ్దుల్లా, పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కె.వి.సుబ్బారెడ్డి, బిటిఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.హరి కొండయ్య మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు, పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యాంకన పరీక్షల నేపథ్యంలో ఈనెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన సోషల్ ఆడిట్ ను వాయిదా వేయాలని సర్వ శిక్ష రాష్ట్ర అధికారులకు ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయని పేర్కొన్నారు. ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా షెడ్యూల్ ను విడుదల చేయడం తగదన్నారు. ఇప్పటికే గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రిటర్నింగ్ అధికారులుగా, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా నియమింపబడి విధులు నిర్వహిస్తున్నారన్నారు. మరోవైపు పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యాంకన పరీక్షలు-1 కొనసాగుతుందని తెలిపారు. ఈ పరిస్థితులలో సోషల్ ఆడిట్ నిర్వహణకు సర్వ శిక్ష అధికారులు షెడ్యూల్ విడుదల చేయడం ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురి చేయడమేనని ఆరోపించారు. పాఠశాలల గ్రాంట్స్ బిల్లుల సమర్పణ విధానాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టతరంగా మార్చివేశారన్నారు. కేవలం 50 శాతం గ్రాంట్స్ ను మాత్రమే మంజూరు చేస్తూ కొత్త నిబంధనలతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. బిల్లులు సమర్పించే విధానాన్ని సరళీకృతం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు చేసిన విజ్ఞప్తిని పెడచెవిన పెట్టడం సహేతుకం కాదన్నారు. మండలాల వారీగా మండల కేంద్రాలలో నిర్వహించాల్సిన సోషల్ ఆడిట్ ను డివిజన్ కేంద్రంలో నిర్వహించడం వల్ల, ఉపాధ్యాయులకు ఆర్థిక భారంతో పాటు, ఏకోపాధ్యాయ పాఠశాలల ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా సర్వ శిక్ష అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం తగదన్నారు. తక్షణమే సోషల్ ఆడిట్ ను డిసెంబర్ రెండవ వారానికి వాయిదా వేయడంతో పాటు, పాఠశాలల గ్రాంట్స్ బిల్లుల సమర్పణ విధానాన్ని సరళీకృతం చేయాలని, ఆడిట్ ను డివిజన్ కేంద్రంలో కాకుండా మండల స్థాయిలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆడిట్ ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ సంఘాల వినతి పై స్పందించిన డిఆర్ఓ కె.మల్లికార్జునుడు సంబంధిత అధికారులతో మాట్లాడి ఆడిట్ ను వాయిదా వేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్, నాయకులు ప్రకాష్ బాబు, ఏపీటీఎఫ్ (1938) నాయకులు చెన్నారెడ్డి పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్