వాగు వద్ద కుంగిన రోడ్డు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం ..
ప్రజాశక్తి మైలవరం (కడప) : మైలవరం మండలంలోని చిన్నవెంతుర్ల నుంచి బెస్టవేముల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ప్రమాదకరంగా మారింది. చిన్న వాగు పక్కనే ఉన్న రహదారి ఒకవైపు భారీగా కుంగిపోవడంతో ప్రతి రోజు ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, రైతులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదం జరగకుండా స్థానికులు ఇటుకలు పెట్టి హెచ్చరికలు చేసినప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం ఇప్పటి వరకు శాశ్వత చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ రహదారి చిన్నవెంతుర్ల, బెస్టవేములతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు కీలక మార్గం. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్యార్థుల పాఠశాలలు, అత్యవసర వైద్య అవసరాల కోసం ఈ రోడ్డుపైనే ప్రజలు ఆధారపడుతున్నారు. అయితే వాగు వద్ద రోడ్డు కుంగిపోవడంతో వాహనాలు ఒకదానికొకటి దాటుకోవడం కూడా కష్టంగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో, వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, వాగు ప్రవాహం కారణంగా రహదారి అడుగు భాగం కోతకు గురై క్రమంగా రోడ్డు కుంగిపోయింది. అయినప్పటికీ అధికారులు తాత్కాలిక హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం ఎప్పుడు జరుగుతుందోననే భయం నెలకొంది. గతంలోనూ దెబ్బతిన్న రహదారుల కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. గ్రామస్థులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో పాటు వాగు వద్ద రక్షణ గోడ హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని ఆర్&బి అధికారులను కోరుతున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ఎప్పుడైనా భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.








కామెంట్‌లు (0)