ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అభివృద్ధి, శాంతి భద్రతల కోసం వైసీపీ మద్దతుదారులకు ఓటు వేయండి : కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి

5 రోజుల క్రితం

Vote for YSRCP candidates for the sake of development and law and order Kadapa MP YS Avinash Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 03:19 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ఎస్ ఈసి, పోలీసులు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలి

వేంపల్లె సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ వలి పేరును ప్రకటించిన ఎంపి


ప్రజాశక్తి - వేంపల్లె (కడప) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుండి వేంపల్లె మండలంలో దాడులు ఎక్కువ అయ్యాయని కాబట్టి అభివృద్ధితో పాటు , శాంతి భద్రతలను కాపాడేందుకు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేంపల్లెలోని పులివెందుల రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాలయంలో ఎంపి అవినాష్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, జడ్పీటీసీ వెంకట శివమ్మ, మాజీ జడ్పీటీసీలు రవికుమార్ రెడ్డి, షబ్బీర్, మాజీ సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, సాదక్ వలి లతో ఎన్నికలపై చర్చించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు, రిగ్గింగ్‌కు పాల్పడిందని తెలిపారు. పులివెందులలో 166 పోలింగ్ బూతుల్లో ఎన్నికలు జరగా అందులో సగం పోలింగ్ బూతులను టిడిపి స్వాధీనం చేసుకొని దౌర్జన్యాలకు పాల్పడినట్లు చెప్పారు. సజావుగా ఎన్నికలు జరిగితే వేంపల్లె జెడ్పీటీసీ ఎన్నికలే నిదర్శనం అన్నారు. వేంపల్లి జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి పోలైన ఓట్లు కేవలం 3,500 మాత్రమేనని వ్యాఖ్యానించారు. సర్పంచ్ ఎన్నికలైనా ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎస్ఈసి, పోలీసులు పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. జగన్ హయాంలో వేంపల్లి అభివృద్ధి పరుగులు పెట్టిందని తెలిపారు. వేంపల్లెలో ఉర్దూ జూనియర్ కళాశాలతో పాటు జిల్లా పరిషత్ బాలుర, బాలికల, డిగ్రీ కళాశాల, పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వేంపల్లె గ్రామ పంచాయతీని చెత్త కుప్పలుగా మార్చి వేశారని తెలిపారు. అలాగే ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు కూడ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. వేంపల్లెను ఆదర్శంగా తీర్చేందుకు ప్రధాన రహదారులు వెడల్పు చేసేందుకు రోడ్ల విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.50 కోట్లు మేరకు నష్ట పరిహారం చెల్లించామని తెలిపారు.కూటమి ప్రభుత్వం వచ్చాక వేంపల్లె అభివృద్ధి, శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. వైసిపి మద్దతుదారులపై దాడులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ కు చెందిన రైస్ మిల్లుపై అక్రమ దాడులు చేసి సీజ్ చేయడం శోచనీయం అన్నారు. వేంపల్లి అభివృద్ధి, శాంతిభద్రతల కోసం ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని కోరారు. వేంపల్లి మేజర్ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా మాజీ జడ్పీటీసీ సభ్యుడైన షబ్బీర్ వలిని ఎంపిక చేసినట్లు తెలిపారు. కాబట్టి వేంపల్లె ప్రజలందరూ వేంపల్లె సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ ని, 20 వార్డుల్లో నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అదేవిధంగా వైసీపీ మద్దతు దారులైన 17 గ్రామ పంచాయతీల్లో కూడ పోటి చేస్తున్న సర్పంచ్, వార్డు అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. అనంతరం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ... వేంపల్లె ప్రజలు దౌర్జన్యాలను, అక్రమాలను సహించరని తెలిపారు.ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వ నాయకుల్లో కనిపించడం లేదని విమర్శించారు. కూటమి నేతలు వేంపల్లె సర్పంచ్ పదవిని రూ 3 కోట్లుకు బేరం పెట్టారని వాటిని ప్రజలు సహించరని తెలిపారు. జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ మెజార్టీ రావడంతో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో అక్రమాలకు తావులేకుండా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు సంబంధించిన వైసీపీ మద్దతు దారులైన సర్పంచ్ అభ్యర్థుల జాబితాను ఎంపి అవినాష్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ వెంకట శివమ్మ, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, వైసీపీ యువ నేత రోహన్ నాగిరెడ్డి తో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్