శనివారం, 31 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చొక్కాలు కుట్టేది ఎవరు ? - టీచర్ల టెట్ ‌లో బుడతడి ప్రశ్నలు !

5 గంటల క్రితం

Who sews the shirts A little boys questions during the teachers TET exam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 10:40 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

సర్వీస్‌ టీచర్ల టెట్‌లో అతి సులభమైన ప్రశ్నలు

ప్రశ్నపత్రం తీరుపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ


ప్రజాశక్తి – అమరావతి : చెట్లను గుర్తించడం, బెల్లం, పంచదార ఏ మొక్క నుంచి తయారవుతాయి, చొక్కాలు, నిక్కర్లు కుట్టే వృత్తి ఎవరిది.. ఇలాంటి సాధారణ ప్రశ్నలు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో చోటుచేసుకున్నాయి. ఇటీవల సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్‌ ప్రశ్నపత్రాల్లో ఇలాంటి ప్రశ్నలు అధికంగా ఉండటంపై చర్చ జరుగుతోంది.


గులాబీ, మందార, తులసి, చింత వంటి మొక్కల్లో చెట్టును గుర్తించడం, బెల్లం, పంచదార తయారీకి ఉపయోగించే మొక్క ఏదో ఎంచుకోవడం, చొక్కాలు, నిక్కర్లు, జాకెట్లు కుట్టే వ్యక్తి ఎవరో గుర్తించడం వంటి ప్రశ్నలు ఇచ్చారు. అంతేకాకుండా ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ సమయంలో విడుదల చేసే వాయువు ఏది ? మానవ శరీరంలో ఆహారం నుంచి శక్తి విడుదల కావడానికి అవసరమైన వాయువు ఏది ? అనే ప్రశ్నలకు ఒకే సమాధానంగా ఆక్సిజన్‌ ఇచ్చేలా ప్రశ్నలు రూపొందించారు. ఈ రెండు ప్రశ్నలను వరుసగా ఇవ్వడం గమనార్హం.


సూర్యుడు, చంద్రుడు, భూమి, పాదరసం వంటి ఐచ్ఛికాలతో స్వయం ప్రకాశక వస్తువును గుర్తించాలని మరో ప్రశ్న ఇచ్చారు. అలాగే గాలి, నీరు, ఖనిజాలు, ప్లాస్టిక్‌లలో సహజ వనరు కానిదాన్ని ఎంచుకోవాలని అడిగారు. ఇలాంటి ప్రాథమిక స్థాయి ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో ప్రశ్నపత్రాల రూపకల్పనపై సామాజిక మాధ్యమాల్లో చర్చ సాగుతోంది. పిల్లలకు బోధించే ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని అంచనా వేయాల్సిన పరీక్షలో ఇంత సాధారణమైన ప్రశ్నలు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రశ్నపత్రాలను ఎస్‌సీఈఆర్టీ రూపొందించింది.


సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రత్యేక టెట్‌ ....

ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31 నాటికి టెట్‌ అర్హత సాధించాలని సుప్రీం కోర్టు గత మే నెలలో తీర్పునిచ్చింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి రాకముందు నియమితులై, ఐదేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్‌లో అర్హత పొందాలని ఆదేశించింది. కనీసం రెండేళ్లకోసారి టెట్‌ నిర్వహించాలని, ప్రతి పరీక్షకు మధ్య ఆరు నెలల వ్యవధి ఉండాలని సూచించింది. పదోన్నతులకు కూడా టెట్‌ అర్హతను తప్పనిసరి చేసింది.


రాష్ట్రంలో 2011కు ముందు నియమితులై, ఐదేళ్ల సర్వీసు మిగిలి ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్‌ అర్హత సాధించాల్సి ఉంటుంది. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారు పదోన్నతులు పొందాలంటే ఈ అర్హత అవసరం. ఈ నేపథ్యంలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. వారి విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం అక్టోబరు 11 నుంచి 15 వరకు ప్రత్యేక టెట్‌ పరీక్షలను నిర్వహించింది.


80,907 మంది హాజరు ....

ఈ ప్రత్యేక టెట్‌కు మొత్తం 83,015 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 80,907 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఐదు రోజులపాటు రోజుకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ప్రాథమిక కీ, అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను అధికారులు విడుదల చేశారు. ప్రశ్నపత్రాల్లో ప్రాథమిక స్థాయి ప్రశ్నలు అధికంగా ఉండటంతో పరీక్ష నిర్వహణ ఉద్దేశం, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని అంచనా వేసే విధానం వంటి అంశాలపై చర్చ మొదలైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్