- సీతారాం ఏచూరి ఫౌండేషన్ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నేతలు
కొల్కతా : పెట్టుబడిదారీ విధానమే గొప్పదని ఎంతగా ప్రచారం చేస్తున్నా... సోషలిజమే ప్రత్యామ్నాయమని జంతర్ మంతర్ చాటి చెప్పిందని ఎస్ఎఫ్ఐ నాయకులు స్పష్టం చేశారు. కొల్కతాలో జరిగిన సీతారాం ఏచూరి ఫౌండేషన్ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నేతలు ఐషీ ఘోష్, దీప్సితా ధర్, సఖీ మాట్లాడారు. . ప్రస్తుత వ్యవస్థపై యువతలో పెరుగుతున్న అసంతృప్తి, ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనల కోసం అన్వేషణ, ఉద్యమాల్లో కొత్త తరహా భాష, వ్యంగ్యం, మీమ్స్ వినియోగం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన యువత ఉద్యమాల గురించి ప్రముఖంగా మాట్లాడారు. విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ప్రైవేటీకరణ పెరుగుతుండడం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కొరత, యువత భవిష్యత్తుపై ఆందోళనలు ఉద్యమాలకు కారణమవుతున్నాయని తెలిపారు. యువత తమ భవిష్యత్తును నిర్ణయించే రాజకీయ వ్యవస్థలో భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఆందోళనకారులు తమ ఫోన్లనే ప్రధాన స్రవంతి మీడియాగా మార్చుకున్నారని, హాస్యాన్ని, కొత్త రకాల ప్రచార పద్ధతులను ఉపయోగించారని తెలిపారు.
సీతారాం ఏచూరి ఫౌండేషన్, జ్యోతి బసు సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ, విద్యావేత్త మాలినీ భట్టాచార్య, చరిత్రకారుడు, రచయిత ముకుల్ కేశవన్ తదితరులు పాల్గొన్నారు. చర్చల్లో సామ్రాజ్యవాదం సమకాలీన రూపాలపై దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన యువ పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. 168 వ్యాసాల నుంచి ఎంపికైన యువ పరిశోధకులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. సీతారాం ఏచూరి స్మారకార్థం నిర్వహించిన ఈ సదస్సులో సామ్రాజ్యవాదం, ప్రజాస్వామ్యం, సమకాలీన రాజకీయ పరిణామాలు, యువత పాత్ర, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ సూత్రాలు, సామాజిక సమానత్వం, అంతర్జాతీయ ఐక్యత వంటి అంశాలపై చర్చను కొనసాగించడమే సీతారాం ఏచూరి ఫౌండేషన్ లక్ష్యంగా పేర్కొంది.







కామెంట్లు (0)