అన్ని పోటీ పరీక్షల ప్రత్యేకం
పోటీ పరీక్షల్లో General Science అంటే కేవలం Physics, Chemistry, Biology పుస్తకాలను చదవడం మాత్రమే కాదు. మన చుట్టూ జరుగుతున్న శాస్త్రీయ పరిణామాలను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో వేలాది మంది అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో Group-I, Group-IIతో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ పరీక్షల్లో జనరల్ స్టడీస్‌లో భాగంగా General Science, Science & Technology, Environment వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. చాలామంది అభ్యర్థులు సైన్స్ అంటే కేవలం Physics, Chemistry, Botany, Zoology పుస్తకాలను మాత్రమే చదవడం అనుకుంటారు. కానీ పోటీ పరీక్షల దృష్టిలో సైన్స్ పరిధి అంతకంటే విస్తృతమైనది. మన రోజువారీ జీవితంలో కనిపించే శాస్త్రీయ అంశాల నుంచి అంతరిక్ష పరిశోధనలు, జీవసాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు, పునరుత్పాదక ఇంధన వనరులు, ఆరోగ్యం, పర్యావరణం, డిజిటల్ టెక్నాలజీ వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ విస్తరించింది. అందువల్ల అభ్యర్థులు సైన్స్‌ను కేవలం ఒక సబ్జెక్టుగా కాకుండా అర్థం చేసుకోవాల్సిన జ్ఞాన రంగంగా చూడాలి. సిలబస్‌నే మొదటి పుస్తకంగా భావించాలి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ప్రతి అభ్యర్థి ముందుగా సంబంధిత పరీక్ష అధికారిక సిలబస్‌ను పూర్తిగా పరిశీలించాలి. APPSC అధికారిక వెబ్సైట్లో Group-I, Group-II తదితర పరీక్షలకు సంబంధించిన సిలబస్‌లు, పాత ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయి. సిలబస్‌ను అర్థం చేసుకున్న తర్వాత, అభ్యర్థులు ముందుగా Core Science అంశాలపై పట్టు సాధించాలి. సిలబస్ చూడకుండా పుస్తకాలు చదవడం వల్ల సమయం ఎక్కువగా వృథా అవుతుంది. కాబట్టి మొదట ఏం చదవాలి? ఎంత వరకు చదవాలి? ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి? అనే స్పష్టత రావాలి. General Scienceను ప్రధానంగా Physics, Chemistry, Biology విభాగాలుగా, Biologyలో Botany, Zoologyగా విభజించి చదవాలి. వీటితో పాటు Environment, Science & Technology అంశాలను కూడా ప్రత్యేకంగా సిద్ధం చేసుకోవాలి.
Core Scienceపై పట్టు సాధిద్దాం
1. Physics
కొలతలు, ప్రమాణాలు (Units and Measurements), చలనం (Motion), చలన నియమాలు (Laws of Motion), పని, శక్తి, సామర్థ్యం (Work, Energy and Power), గురుత్వాకర్షణ (Gravitation). పదార్థ ధర్మాలు (Properties of Matter), ఉష్ణం, ఉష్ణగతిశాస్త్రం (Heat and Thermodynamics), ధ్వని (Sound), కాంతి, కాంతిశాస్త్రం (Light and Optics), విద్యుత్ (Electricity), అయస్కాంతత్వం (Magnetism), విద్యుదయస్కాంత తరంగాలు (Electromagnetic Waves), ఆధునిక భౌతికశాస్త్రం (Modern Physics), అణు భౌతికశాస్త్రం (Nuclear Physics), రోజువారీ జీవితంలో భౌతికశాస్త్రం వినియోగాలు (Applications of Physics in Everyday Life).
ఎలా చదవాలాంటే ?
సూత్రాలను కంఠస్థం చేయడం మాత్రమే కాకుండా, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ భావన, రోజువారీ జీవితంలోని అనువర్తనం అర్థం చేసుకోవాలి.
ఉదాహరణకు ప్రెషర్ కుక్కర్లో ఆహారం త్వరగా ఎందుకు ఉడుకుతుంది? రెయిన్బోలో ఏడు రంగులు ఎందుకు కనిపిస్తాయి? మొబైల్ ఫోన్లో కెమెరా ఎలా పనిచేస్తుంది? సౌర విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ ప్యాక్ ఎందుకు ఉపయోగిస్తారు? ఇలాంటి ప్రశ్నల వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను అర్థం చేసుకుంటే అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది.
2. Chemistry
పదార్థం, దాని ధర్మాలు (Matter and its Properties), అణు నిర్మాణం (Structure of Atom), ఆవర్తన పట్టిక (Periodic Table), మూలకాలు, సమ్మేళనాలు (Elements and Compounds), రసాయన బంధం (Chemical Bonding), రసాయన చర్యలు (Chemical Reactions), ఆమ్లాలు, క్షారాలు, లవణాలు (Acids, Bases and Salts), లోహాలు, అలోహాలు (Metals and Non-metals), కార్బన్ సమ్మేళనాలు (Carbon Compounds), ఇంధనాలు (Fuels), పాలిమర్లు (Polymers), దైనందిన జీవితంలో రసాయనశాస్త్రం (Everyday Chemistry), పర్యావరణ రసాయనశాస్త్రం (Environmental Chemistry), ముఖ్యమైన రసాయన పదార్థాలు, వాటి ఉపయోగాలు (Important Chemicals and their Uses)
ఎలా చదవాలి?
మన రోజువారీ జీవితంలో ఉపయోగించే సబ్బులు, డిటర్జెంట్లు, ఎరువులు, ఇంధనాలు, మందులు, ప్లాస్టిక్స్, లోహాలు వంటి వాటితో Chemistryని అనుసంధానం చేసుకోవాలి.
3. Biology
Botanyను ప్రత్యేకంగా చదవడం చాలా ముఖ్యం. ప్రధానంగా
కణం – నిర్మాణం, విధులు (Cell – Structure and Functions), వృక్ష కణజాలాలు (Plant Tissues),వృక్ష ప్రపంచం (Plant Kingdom), కిరణజన్య సంయోగక్రియ (Photosynthesis), మొక్కలలో శ్వాసక్రియ (Respiration in Plants), మొక్కల పోషణ (Plant Nutrition), మొక్కలలో పదార్థాల రవాణా (Transport in Plants), మొక్కల పెరుగుదల, అభివృద్ధి (Plant Growth and Development), మొక్కల ప్రత్యుత్పత్తి(Plant Reproduction),విత్తనాలు మరియు అంకురోత్పత్తి (Seeds and Germination), మొక్కల హార్మోన్లు (Plant Hormones), మొక్కల ఆర్థిక ప్రాధాన్యత (Economic Importance of Plants), వ్యవసాయానికి సంబంధించిన ప్రాథమిక శాస్త్రం (Agriculture-related Basic Science), మొక్కల వ్యాధులు (Plant Diseases), జీవవైవిధ్యం మరియు పరిరక్షణ (Biodiversity and Conservation)రోజువారీ జీవితంతో సైన్స్‌ను అనుసంధానం చేసుకోవాలి.
4. Zoology – జంతుశాస్త్రం
Zoologyని Biologyలో ఒక చిన్న భాగంగా కాకుండా స్వతంత్రంగా సిద్ధం కావాల్సిన విభాగంగా చూడడం మంచిది.
ప్రధాన అంశాలు:
జంతు రాజ్యం, వర్గీకరణ (Animal Kingdom and Classification), జంతు కణజాలాలు (Animal Tissues), మానవ జీర్ణవ్యవస్థ (Human Digestive System), శ్వాసకోశ వ్యవస్థ (Respiratory System), రక్త ప్రసరణ వ్యవస్థ (Circulatory System), విసర్జన వ్యవస్థ (Excretory System), నాడీ వ్యవస్థ (Nervous System), అంతఃస్రావ గ్రంథుల వ్యవస్థ (Endocrine System), ప్రత్యుత్పత్తి వ్యవస్థ (Reproductive System), మానవ పోషణ (Human Nutrition), విటమిన్లు, ఖనిజ లవణాలు (Vitamins and Minerals), మానవ వ్యాధులు (Human Diseases), సంక్రమణ మరియు అసంక్రమణ వ్యాధులు (Communicable and Non-communicable Diseases), రోగనిరోధక శక్తి, టీకాలు (Immunity and Vaccination), సూక్ష్మజీవులు (Microorganisms), జన్యుశాస్త్రం (Genetics), వంశపారంపర్యం (Heredity), పరిణామం (Evolution), జీవసాంకేతిక పరిజ్ఞానం – ప్రాథమిక అంశాలు (Biotechnology – Basic Concepts), జంతు ఆరోగ్యం, సంక్షేమం (Animal Health and Welfare).
ముఖ్యంగా:
మానవ శరీర వ్యవస్థలు, పోషకాలు, విటమిన్లు, వ్యాధులు, రోగనిరోధక శక్తి, వ్యాక్సినేషన్, Genetics వంటి అంశాలపై ప్రశ్నలు వస్తున్నందున వీటిని Conceptతో చదవాలి.
Core Scienceపై పట్టు సాధించిన తర్వాత, ప్రకృతి, పర్యావరణం మరియు సమకాలీన శాస్త్రీయ పరిణామాలను కూడా అర్థం చేసుకోవడం అవసరం.
5. Environment – పర్యావరణ శాస్త్రం
General Scienceతో పాటు పర్యావరణ అంశాలపై కూడా అవగాహన అవసరం.
పర్యావరణ వ్యవస్థ (Ecosystem), ఆహార గొలుసు, ఆహార వలయం (Food Chain and Food Web), జీవవైవిధ్యం (Biodiversity), సహజ వనరులు (Natural Resources), కాలుష్యం (Pollution), వాయు, జల కాలుష్యం (Air and Water Pollution), వాతావరణ మార్పు (Climate Change), భూతాపం / గ్లోబల్ వార్మింగ్ (Global Warming), ఓజోన్ పొర (Ozone Layer), సుస్థిర అభివృద్ధి (Sustainable Development), జీవవైవిధ్య పరిరక్షణ (Conservation of Biodiversity), పర్యావరణ సమస్యలు (Environmental Issues).
గమనిక: పోటీ పరీక్షల కోసం “వాతావరణ మార్పు (Climate Change)” , “భూతాపం (Global Warming)” రెండింటినీ వేర్వేరు అంశాలుగా చదవడం మంచిది. అలాగే జీవవైవిధ్యం–పరిరక్షణ, కాలుష్యం, ఓజోన్ పొర, సుస్థిర అభివృద్ధి అంశాలకు ప్రస్తుత పరిణామాలను కూడా అనుసంధానం చేయాలి.
6. Science & Technology
నేటి పోటీ పరీక్షల్లో Science & Technology ప్రాధాన్యం గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల సంప్రదాయ General Scienceతో పాటు సమకాలీన సాంకేతిక పరిజ్ఞానంపై కూడా అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి.ప్రధానంగా
Artificial Intelligence, Machine Learning, Biotechnology, Genetic Engineering, Nanotechnology, Space Technology, Satellite Technology, Nuclear Technology, Renewable Energy, Electric Vehicles, Semiconductor Technology, 5G/6G Communication, Cyber Security, Robotics, Quantum Technology, Digital Technology వంటి అంశాలను ప్రాథమిక స్థాయిలో అర్థం చేసుకోవాలి.
ప్రతి అంశాన్ని Basic Concept + Current Developments + Applications అనే మూడు కోణాల్లో చదవాలి. అంటే అది ఏమిటి? ఎలా పనిచేస్తుంది? దాని ఉపయోగాలు ఏమిటి? ప్రయోజనాలు–పరిమితులు ఏమిటి? భారతదేశానికి దాని ప్రాధాన్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే స్థాయిలో సిద్ధం కావాలి.
Current Affairs అనుసంధానం
అదే సమయంలో Science & Technologyను Current Affairsతో అనుసంధానం చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక కొత్త అంతరిక్ష ప్రయోగం జరిగినప్పుడు కేవలం దాని పేరును మాత్రమే గుర్తుపెట్టుకోకుండా— దాని లక్ష్యం ఏమిటి? ఏ సాంకేతికతను ఉపయోగించారు? దాని శాస్త్రీయ ప్రయోజనం ఏమిటి? అనే కోణాల్లో చదవాలి. ఇదే విధంగా కొత్త వ్యాక్సిన్, AI పరిణామాలు, ఉపగ్రహ ప్రయోగాలు, సెమీకండక్టర్ పరిశ్రమ, పునరుత్పాదక ఇంధనం వంటి సమకాలీన అంశాలను సంబంధిత ప్రాథమిక సైన్స్‌తో అనుసంధానం చేసుకోవాలి.
అందువల్ల Science & Technologyను కేవలం Static GKగా కాకుండా, Basic Science + Technology + Current Affairs + Applications అనే సమగ్ర దృక్పథంతో చదవడం పోటీ పరీక్షల్లో మరింత ప్రయోజనకరం.
ఏ అంశాలు చదవాలో తెలుసుకున్న తర్వాత, పరీక్షలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారో తెలుసుకోవడానికి Previous Questionsను విశ్లేషించాలి.
Previous Questionsకు ప్రత్యేక ప్రాధాన్యం
పాత ప్రశ్నపత్రాలు అభ్యర్థికి పరీక్ష స్వభావాన్ని అర్థం చేసుకునే అవకాశం కల్పిస్తాయి. APPSC అధికారిక వెబ్సైట్లో పాత ప్రశ్నపత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక ప్రశ్నపత్రాన్ని కేవలం పరీక్షలా రాసి మార్కులు చూసుకోవడం కంటే—
ప్రశ్న → సరైన సమాధానం → ఆ ప్రశ్నకు సంబంధించిన Concept → సంబంధిత ఇతర ప్రశ్నలు అనే విధానంలో విశ్లేషించాలి.
ఒక ప్రశ్న ద్వారా ఒకే సమాధానం కాకుండా ఒక చిన్న Concept Map తయారు చేసుకుంటే అదే అంశం నుంచి వచ్చే అనేక ప్రశ్నలకు సిద్ధం కావచ్చు.
రోజుకు కొద్దిసేపైనా సైన్స్‌కు కేటాయించాలి
సైన్స్‌ను చివరి నెలల్లో చదవడానికి వదిలేయడం మంచిది కాదు. రోజుకు 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు కేటాయించవచ్చు. ఉదాహరణకు: 20 నిమిషాలు – Concept చదవడం, 15 నిమిషాలు – Current Science & Technology, 15 నిమిషాలు – MCQs, 10 నిమిషాలు – Revision అనే విధానాన్ని అనుసరించవచ్చు.
చిన్న నోట్స్ – పెద్ద ప్రయోజనం
ప్రతి అంశానికి పెద్ద పెద్ద నోట్స్ రాయడం కంటే One-page Science Notes తయారు చేసుకోవాలి. ఉదాహరణకు “Solar Energy” అనే అంశానికి— Principle,Types, Applications, Advantages, Limitations Recent developments అనే శీర్షికల కింద సంక్షిప్తంగా రాసుకోవచ్చు. ఇలాంటి నోట్స్ చివరి దశలో Revisionకు ఎంతో ఉపయోగపడతాయి.
MCQsను కేవలం జ్ఞాపకశక్తి పరీక్షగా చూడకూడదు
ఒక MCQకు సమాధానం తెలియకపోతే సరైన optionను మాత్రమే గుర్తుంచుకోవడం కంటే మిగిలిన మూడు options ఎందుకు తప్పో తెలుసుకోవాలి. ఉదాహరణకు ఒక ప్రశ్నలో నాలుగు శాస్త్రీయ పదాలు ఉంటే, సరైన సమాధానంతో పాటు మిగిలిన మూడు పదాల అర్థాలను కూడా తెలుసుకోవాలి. ఇది తదుపరి ప్రశ్నల్లో ఉపయోగపడుతుంది.
అభ్యర్థులు చేసే సాధారణ తప్పులు
సైన్స్ తయారీలో కొన్ని సాధారణ తప్పులను నివారించాలి. మొదటిది – చాలా పుస్తకాలు చదవడం. పుస్తకాల సంఖ్య పెరిగేకొద్దీ జ్ఞానం తప్పనిసరిగా పెరగదు. మంచి ప్రామాణిక వనరులను ఎంపిక చేసుకుని వాటిని పలుమార్లు చదవడం ప్రయోజనకరం.
రెండవది – Current Affairs మాత్రమే చదవడం.
Current Affairs వెనుక ఉన్న Basic Science తెలియకపోతే ప్రశ్నను విశ్లేషించడం కష్టం.
మూడవది – Revisionను నిర్లక్ష్యం చేయడం. చదివినదాన్ని పునశ్చరణ చేయకపోతే జ్ఞాపకశక్తిలో నిలవదు.
నాలుగవది – MCQs ఎక్కువగా చేసి Conceptsను విస్మరించడం. వేల MCQs చేయడం కంటే వాటి ద్వారా Conceptsను బలపరచుకోవడం ముఖ్యం.
సైన్స్ ప్రిపరేషన్‌కు ఒక సరళమైన సూత్రాన్ని అనుసరించవచ్చు.
చదవడం → అర్థం చేసుకోవడం → ప్రశ్నలు సాధన చేయడం → తప్పులను విశ్లేషించడం → పునశ్చరణ. ఈ ఐదు దశలను నిరంతరం కొనసాగిస్తే సైన్స్ పట్ల ఉన్న భయం క్రమంగా తగ్గుతుంది.
చివరగా…
ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పడుతున్న ప్రతి అభ్యర్థికి సైన్స్ ఒక భారమైన సబ్జెక్టు కాదు; సరైన పద్ధతిలో చదివితే మంచి స్కోరు సాధించగల విభాగం.
Physicsను జీవితంలోని సంఘటనలతో, Chemistryని మన చుట్టూ ఉన్న పదార్థాలతో, Biologyని మన శరీరం–ఆరోగ్యంతో, Science & Technologyని సమకాలీన ప్రపంచంతో అనుసంధానం చేసుకుని చదవాలి.
పోటీ పరీక్షల్లో సైన్స్ విజయానికి కంఠస్థం ఒక్కటే మార్గం కాదు.
Conceptపై అవగాహన, Current Affairsపై దృష్టి, Previous Questions విశ్లేషణ, నిరంతర MCQ సాధన, క్రమబద్ధమైన Revision — ఈ ఐదు అంశాల సమన్వయమే విజయానికి బలమైన పునాది.
ఉద్యోగం కోసం చదివే సైన్స్… పరీక్షలో మార్కులు సాధించడానికే కాదు; శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఒక అవకాశం.
ప్రతిరోజూ పాటించాల్సిన విధానం
Concept చదవండి → అర్థం చేసుకోండి → Short Notes తయారు చేయండి → MCQs సాధన చేయండి → తప్పులను విశ్లేషించండి → Revision చేయండి
ప్రత్యేకంగా గుర్తుంచుకోండి
General Science = Physics + Chemistry + Botany + Zoology + Environment
Science & Technology = Basic Science + Current Developments + Applications
ముఖ్య సూత్రం:
“Current Affairsను విడిగా చదవకండి. దాని వెనుక ఉన్న Basic Science Conceptను కూడా తెలుసుకోండి.”
చివరి దశలో తప్పనిసరిగా
Concepts + Short Notes + Previous Questions + Current Affairs + Mock Tests
ఈ ఐదు అంశాలను సమన్వయంతో సాధన చేయడం ద్వారా General Science మరియు Science & Technologyలో మంచి పట్టు సాధించొచ్చు.
డాక్టర్. పల్లె. సూర్యనాగి రెడ్డి
భౌతికశాస్త్ర అధ్యాపకులు
ప్రభుత్వ కళాశాల (అటానమస్), అనంతపురం.
సెల్ : 9491155894







కామెంట్లు (0)