ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

వెండితెర వారసురాళ్లు ...

2 గంటల క్రితం

movies
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 11:45 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

సినీ కుటుంబాల్లో వారసత్వం అంటే చాలాకాలం కొడుకుల పేరే వినిపించేది. తండ్రి హీరో అయితే కొడుకు హీరో కావడం, దర్శకుడి కొడుకు దర్శకుడవడం, నిర్మాత కుమారుడు నిర్మాతగా మారడం సహజంగా భావించేవారు. కూతుళ్లు సినిమా కుటుంబంలో పుట్టినా తెరపైకి రావడం అరుదు. కొన్నేళ్లుగా ఆ దృశ్యం మారుతోంది. సినీ కుటుంబాల నుంచి వస్తున్న కూతుళ్లు వెండితెర వెనుకా, ముందూ తమ ప్రతిభతో రాణిస్తున్నారు. మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ కుమార్తె విస్మయ తాజాగా ‘తుడక్కం’తో కథానాయికగా పరిచయమైంది. ఆగస్టు 7న విడుదలైన ఆ సినిమా ఏడో రోజుకు ప్రపంచవ్యాప్తంగా రూ.33.46 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. భారతీయ సినిమా కుటుంబాల్లో ఇంకా ఎంతోమంది కుమార్తెలు తమదైన మార్గంలో చిత్రసీమలో రాణిస్తున్నారు. ఒకప్పుడు తమ కథానాయకుడి కుమార్తె హీరోయిన్‌‌గా మరొక నటుడికి జోడీగా నటించటాన్ని సైతం అంగీకరించలేని పురుషాధిపత్య భావజాలం అభిమానుల్లో ఉండేది. కృష్ణ కుమార్తె మంజుల హీరోయిన్‌ కావాలనుకున్నప్పుడు ఇతర హీరోల సరసన నటించడాన్ని అభిమానులు అంగీకరించలేదు. వారి ఒత్తిడితో కృష్ణ ఆమె సినిమాల్లో నటించబోదని ప్రకటించాల్సి వచ్చింది. ఆ తరువాత పరిస్థితి మారింది.

తన అభిరుచిని వదలుకోలేని మంజుల కొంత ఆలస్యంగా ‘రాజస్థాన్‌’, ‘సమ్మర్‌ ఇన్‌ బెత్లెహెమ్‌’, ‘షో’ వంటి చిత్రాల్లో నటించింది. నిర్మాతగా ‘షో’, ‘నాని’, ‘పోకిరి’, ‘ఏ మాయ చేసావె’ వంటి చిత్రాలతో భాగస్వామ్యం పంచుకుంది. ‘మనసుకు నచ్చింది’తో దర్శకురాలిగానూ మారింది. మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి అమెరికా టెలివిజన్‌ రంగంలో పనిచేసిన తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. ‘అనగనగా ఓ ధీరుడు’, ‘గుండెల్లో గోదారి’ వంటి చిత్రాల్లో కనిపించింది. నిర్మాతగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగానూ కొనసాగింది. రాజశేఖర్‌–జీవిత కుమార్తెలు శివాని, శివాత్మిక నటనను ఎంచుకున్నారు. శివాని ‘అద్భుతం’, ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ వంటి చిత్రాల్లో నటించగా, శివాత్మిక ‘దొరసాని’, ‘పంచతంత్రం’, ‘రంగమార్తాండ’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. తెలుగు నటుడు రాజేశ్‌ కుమార్తె ఐశ్వర్య రాజేశ్‌ తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’, ‘టక్‌ జగదీష్‌’, ‘రిపబ్లిక్‌’ వంటి చిత్రాల్లో నటించింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయంతో ఆమెకు తెలుగులోనూ మరిన్ని అవకాశాలు వచ్చాయి. నటుడు శరత్‌కుమార్‌ కుమార్తె వరలక్ష్మి తమిళంతో పాటు తెలుగులోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. 2026లో ‘ఎస్‌. సరస్వతి’తో దర్శకురాలిగానూ మారి, నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టింది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ‘ఖైదీ నంబర్‌ 150’, ‘రంగస్థలం’ వంటి చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసి, తర్వాత నిర్మాతగా మారింది. నాగబాబు కుమార్తె నిహారిక ‘ఒక మనసు’లో నటించిన తర్వాత నిర్మాణ రంగంలోకి వెళ్లింది. ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. నిర్మాత అశ్వినీదత్‌ కుమార్తెలు స్వప్న దత్‌, ప్రియాంక దత్‌ తండ్రి స్థాపించిన నిర్మాణ సంస్థను నిర్వహిస్తూ ‘మహానటి’, ‘సీతారామం’ వంటి చిత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. నిర్మాత దిల్‌ రాజు కుమార్తె హన్షితా రెడ్డి కూడా నిర్మాణ రంగంలో కొనసాగుతోంది. అక్కినేని కుటుంబానికి చెందిన సుప్రియ యార్లగడ్డ నటిగా పరిచయమైన తర్వాత నిర్మాతగా మారి చిత్ర నిర్మాణంలో కొనసాగుతోంది.

తమిళ, మలయాళ రంగాల్లో ...

కమల్‌హాసన్‌ కుమార్తెలు శ్రుతి హాసన్‌, అక్షర హాసన్‌ విభిన్న విభాగాలను ఎంచుకొని సినీసీమలో రాణిస్తున్నారు. శ్రుతి నటిగా మాత్రమే కాకుండా గాయనిగా, సంగీత కళాకారిణిగానూ కొనసాగుతోంది. తెలుగులో ‘గబ్బర్‌సింగ్‌’, ‘రేసుగుర్రం’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాల్లో నటించింది. అక్షర నటిగా మారకముందు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసింది. తర్వాత ‘షమితాభ్‌’తో నటిగా పరిచయమైంది. రజనీకాంత్‌ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య దర్శకత్వాన్ని ఎంచుకున్నారు. నటి మేనక, నిర్మాత జి. సురేశ్‌కుమార్‌ కుమార్తె కీర్తి సురేశ్‌ దక్షిణాది చిత్రసీమలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ‘మహానటి’లో సావిత్రి పాత్రకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. మలయాళంలో దర్శకుడు ప్రియదర్శన్‌, నటి లిజీల కుమార్తె కల్యాణి ప్రియదర్శన్‌ తొలుత ప్రొడక్షన్‌ డిజైన్‌, ఆర్ట్‌ విభాగాల్లో అనుభవం సంపాదించిన తర్వాత తెలుగులో ‘హలో’తో కథానాయికగా పరిచయమైంది. అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన తర్వాత ‘సీతా పయనం’తో తెలుగులోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి ఆమె తండ్రి అర్జున్‌ దర్శకత్వం వహించారు. నటి రాధ కుమార్తెలు కార్తిక, తులసి నాయర్‌ కూడా తల్లి నటనా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. నటుడు విజయకుమార్‌ కుమార్తెలు వనిత, ప్రీత, శ్రీదేవి కూడా నటనా రంగంలోకి వచ్చారు.

బాలీవుడ్‌లో విస్తృతంగా...

హిందీ చిత్రసీమలో ఈ పరిణామం మరింత విస్తృతంగా కనిపిస్తోంది. మహేశ్‌ భట్‌ కుటుంబంలో పూజా భట్‌ నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణంలో పనిచేయగా, ఆలియా భట్‌ నటిగా ఎదిగి ‘డార్లింగ్స్‌’తో నిర్మాతగానూ మారింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటించడం ద్వారా ఆలియా తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైంది. బోనీ కపూర్‌, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ ‘దేవర’తో తెలుగు తెరకు వచ్చింది. ఆమె చెల్లెలు ఖుషీ కపూర్‌ కూడా నటనా రంగంలోకి వచ్చింది. అనిల్‌ కపూర్‌ కుటుంబంలో సోనమ్‌ కపూర్‌ నటిగా, రియా కపూర్‌ నిర్మాతగా తమదైన దారులు ఎంచుకున్నారు. జావేద్‌ అఖ్తర్‌ కుమార్తె జోయా అఖ్తర్‌ దర్శకురాలిగా, రచయితగా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ధర్మేంద్ర, హేమమాలిని కుమార్తె ఈషా డియోల్‌ కూడా ‘ధూమ్‌’, ‘నో ఎంట్రీ’ వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. శర్మిలా ఠాగూర్‌ కుమార్తె సోహా అలీఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌–అమృతాసింగ్‌ కుమార్తె సారా అలీఖాన్‌ కూడా సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారిలో ఉన్నారు.

సినీ కుటుంబంలో పుట్టడం వల్ల వీరికి తొలి అవకాశం సులభంగా రావొచ్చు. పరిచయాలు, వనరులు, పరిశ్రమపై అవగాహన అందుబాటులో ఉండొచ్చు. కానీ ప్రేక్షకుడి ముందు నిలబడిన తర్వాత ఆ పరిచయం ఒక్కటే సరిపోదు. సొంత ప్రతిభతోనే గుర్తింపును నిలబెట్టుకోవాలి. వారసత్వం అంటే కొడుకు తండ్రి వృత్తిని కొనసాగించడమే కాదు; కూతుళ్లు కూడా కుటుంబం నుంచి వచ్చిన అవకాశాన్ని తమ ఆసక్తి, ప్రతిభకు అనుగుణంగా మలుచుకుని కొత్త దారిని నిర్మించుకోవడం కూడా.

- ప్రజాశక్తి సినిమా డెస్క్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్