శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెండితెరపై ప్రయోగాల సింగీతం

2 గంటల క్రితం

వెండితెరపై ప్రయోగాల సింగీతం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 11:39 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

తెలుగు సినిమాల్లో సరికొత్త ఆలోచనలకు, సాంకేతిక ప్రయోగాలకు వారధిగా, సారథిగా నిలిచిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. చిత్ర పరిశ్రమలో ప్రతిసారీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్న దర్శకుడాయన. 1931 సెప్టెంబరు 21న ఉదయగిరిలో జన్మించిన ఆయన మద్రాసు విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. సైన్సు నేపథ్యం ఆయన ఆలోచనా విధానంలోనూ ప్రతిఫలించింది. ఏ విషయాన్నయినా ప్రశ్నించడం, కొత్త కోణంలో పరిశీలించడం, సాధ్యాసాధ్యాలను పరీక్షించడం ఆయన స్వభావంగా మారింది. సినిమాపై ఆసక్తితో చిత్రసీమలోకి ప్రవేశించి, దిగ్గజ దర్శకుడు కె.వి.రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. 'మాయాబజార్‌', 'జగదేకవీరుని కథ' వంటి చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ కథనంలోని మాయాజాలాన్ని, దృశ్యాల ప్రాధాన్యాన్ని, సాంకేతికతను సృజనాత్మకంగా ఉపయోగించుకునే పద్ధతులను ఆకళింపు చేసుకున్నారు. 1972లో 'నీతి నిజాయితీ'తో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించారు. ఆ తరువాత 'తరం మారింది', 'పంతులమ్మ', 'అమెరికా అమ్మాయి', 'సొమ్మొకడిది సోకొకడిది', 'అమావాస్య చంద్రుడు' వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. తెలుగు సినిమాకే పరిమితం కాకుండా కన్నడ, తమిళ, హిందీ, ఆంగ్ల భాషల్లోనూ ఆరు దశాబ్దాల పాటు అరవైకి పైగా చిత్రాలను రూపొందించారు.

ప్రయోగాల ప్రస్థానం

ఒక సినిమా విజయవంతమైతే అదే పద్ధతిని మళ్లీ అనుసరించకుండా మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవడం ఆయన ప్రత్యేకత. 1987లో విడుదలైన 'పుష్పక విమానం' భారతీయ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయి. ఒక్క సంభాషణ కూడా లేకుండా పూర్తి నిడివి చిత్రాన్ని నిర్మించారు. అయితే ఇది మూకీ సినిమా కాదు. సంగీతం, శబ్దాలు, నటుల హావభావాలు, దృశ్యాల కూర్పుతో కథను ముందుకు నడిపించారు. నిరుద్యోగ యువకుడు అనుకోకుండా ఒక సంపన్నుడి స్థానాన్ని ఆక్రమించడం, ఆ క్రమంలో ఎదురయ్యే హాస్యాస్పదమైన, విషాదకరమైన పరిణామాలే కథాంశం. పేదరికం, నిరుద్యోగం, ధనికుల విలాసవంతమైన జీవితం, మానవ సంబంధాల్లోని స్వార్థం వంటి అంశాలను వ్యంగ్యంతో ఆవిష్కరించారు. మాటలు లేకపోయినా ప్రేక్షకుడికి ప్రతి భావోద్వేగం అర్థమవుతుందని నిరూపించారు. చార్లీ చాప్లిన్‌ చిత్రాల స్ఫూర్తితో హాస్యాన్ని, విషాదాన్ని కలగలిపిన ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది. జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. కేన్స్‌ చిత్రోత్సవంలోనూ ప్రదర్శితమైంది. ప్రమాదంలో కాలును కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో నృత్యాన్ని కొనసాగించి నర్తకిగా ఎదిగిన సుధాచంద్రన్‌ జీవితం ఆధారంగా 'మయూరి' చిత్రాన్ని వెండితెరపైకి తీసుకొచ్చారు. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం, కళ పట్ల అంకితభావాన్ని ప్రధాన ఇతివృత్తంగా మలిచారు. సుధాచంద్రన్‌తోనే ప్రధాన పాత్రను పోషింపజేయడం మరో విశేషం. కళాకారుడి సంకల్పం శారీరక పరిమితులను అధిగమించగలదని చెప్పిన స్ఫూర్తిదాయకమైన ప్రయోగమిది. 'అమావాస్య చంద్రుడు'లో అంధుడైన కథానాయకుడి ప్రపంచాన్ని దృశ్యాల ద్వారా ఆవిష్కరించడం కూడా ఆయన కథన ప్రయోగాల్లో ఒకటి. పాత్ర అనుభవించే పరిమితులను ప్రేక్షకుడు కూడా అనుభూతి చెందేలా చేయడం ఆయన దర్శకత్వంలోని సున్నితత్వానికి నిదర్శనం.

కాలయంత్రంలో సరికొత్త ప్రయాణం

విజ్ఞానశాస్త్రాన్ని, ఊహాశక్తిని, వినోదాన్ని కలిపి సినిమాలు రూపొందించడంలో సింగీతం చూపిన ప్రతిభకు అత్యుత్తమ ఉదాహరణ 'ఆదిత్య 369'. 1991లో వచ్చిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కాలయంత్ర ప్రయాణాన్ని పరిచయం చేసింది. టైమ్‌ ట్రావెల్‌ అనే శాస్త్రీయ భావన ఆధారంగా గతంలోకి, భవిష్యత్తులోకి ప్రయాణించే కథను రూపొందించారు. అప్పట్లో కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, ఆధునిక విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందుబాటులో లేకపోయినా పరిమిత సాంకేతిక వనరులతోనే కాలయంత్రాన్ని, భవిష్యత్తు ప్రపంచాన్ని, చారిత్రక వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి కథానాయకులు ప్రయాణించే సన్నివేశాలు చరిత్రను, సైన్స్‌ ఫిక్షన్‌ను అనుసంధానించాయి. తెలుగు సినిమాలో సైన్స్‌ ఫిక్షన్‌కు కొత్త అవకాశాలు తెరిచిన చిత్రంగా ఇది నిలిచిపోయింది. ఇక 'భైరవద్వీపం'లో జానపద ఫాంటసీకి సరికొత్త రూపునిచ్చారు. మంత్రాలు, మాయలు, రాక్షసులు, రాజ్యాలు, రాజకుమారులు వంటి సంప్రదాయ జానపద అంశాలను తీసుకున్నప్పటికీ వాటి ప్రదర్శనలో కొత్తదనాన్ని చూపించారు.

నటనలోనూ కొత్త ప్రయోగాలు

నటుల నుంచి విభిన్నమైన నటనను రాబట్టడంలోనూ, కథన నిర్మాణంలోనూ సింగీతం అనేక ప్రయోగాలు చేశారు. 'అపూర్వ సోదరులు' చిత్రంలో కమల్‌హాసన్‌తో ఒక మరుగుజ్జు పాత్రను పోషింపజేయడం అలాంటి ప్రయత్నమే. ఇందుకోసం కెమెరా కోణాలు, ప్రత్యేక సెట్లు, శరీరాకృతిని చిన్నదిగా చూపించే చిత్రీకరణ పద్ధతులను సమర్థంగా ఉపయోగించుకున్నారు. ఆ పాత్రకు బలమైన భావోద్వేగ నేపథ్యాన్ని కూడా కల్పించారు. 'మైఖేల్‌ మదన కామరాజన్‌'లో కమల్‌హాసన్‌తో నాలుగు విభిన్న పాత్రలు పోషింపజేసి, ఒకే నటుడి ద్వారా నాలుగు స్వభావాలను, వ్యక్తిత్వాలను తెరపై ఆవిష్కరించారు. 'సొమ్మొకడిది సోకొకడిది'లోనూ ద్విపాత్రాభినయాన్ని హాస్యానికి, కథలోని మలుపులకు ఉపయోగించుకున్నారు. కన్నడలో రాజ్‌కుమార్‌తో చేసిన చిత్రాలు, తమిళంలో 'మగళిర్‌ మట్టుం', 'కాతల కాతల' వంటి సినిమాలు ఆయన బహుముఖ ప్రతిభకు నిదర్శనాలు. మహిళల కార్యాలయ జీవితంలోని సమస్యలను హాస్యంతో చెప్పిన 'మగళిర్‌ మట్టుం'లో సామాజిక అంశాన్ని వినోదాత్మకంగా ఆవిష్కరించారు. 'ఘటోత్కచ', 'సన్‌ ఆఫ్‌ అలాద్దీన్‌' వంటి యానిమేషన్‌ చిత్రాలతో మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. భారతీయ పురాణ పాత్రలను యానిమేషన్‌ సాంకేతికతతో పిల్లలకు పరిచయం చేశారు. 'వెల్‌కమ్‌ ఒబామా'లో అంతర్జాతీయ మానవ సంబంధాలను ఇతివృత్తంగా తీసుకున్నారు. ఇన్ని భిన్నమైన ప్రక్రియల్లో పనిచేసి, వాటిలోనూ తనదైన ముద్ర వేయడం ఆయన ప్రత్యేకత.

ఊహలకు రెక్కలు

సింగీతం ప్రయోగాల పరంపర వయసుతో ఆగిపోలేదు. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే మనసులో రూపుదిద్దుకున్న ఒక ఆలోచనకు 2026లో 'సింగ్‌ గీతం' ద్వారా తెరరూపమిచ్చారు. పాటల రూపంలోనే కథను ముందుకు నడిపించే సంగీత ప్రధాన చిత్రాన్ని రూపొందించారు. 'పుష్పక విమానం'లో మాటలను పూర్తిగా పక్కనపెట్టిన దర్శకుడు, ఈ చిత్రంలో కథనాన్నే పాటలతో నిర్మించడం విశేషం. 94 ఏళ్ల వయసులోనూ కొత్త సినిమా చేయడానికి సిద్ధపడటం ఆయన సృజనాత్మక చైతన్యానికి నిదర్శనం. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించిన ఆయనకు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నంది పురస్కారాలు, ఫిలింఫేర్‌ అవార్డులు, కర్ణాటక రాష్ట్ర పురస్కారాలు లభించాయి. ఆయన చూపించిన కొత్త దారులు భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. సినిమా ఎలా తీయాలో మాత్రమే కాదు, ఇంకా ఎన్ని రకాలుగా తీయవచ్చో చూపించిన ప్రయోగశీలి సింగీతం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్