తెలంగాణ : ' నేనైతే వారానికోసారి మొబైల్ పాస్‌వర్డ్ మారుస్తా ` అని నాగార్జున అన్నారు. సైబర్ నేరాలను అరికట్టడంలో తెలంగాణ సైబర్ పోలీసులు దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నారని అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రశంసించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగిన ‘సురక్ష కా తిరంగా’ సైబర్ అవగాహన కార్యక్రమానికి డిజిపి సివి ఆనంద్‌తో పాటు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గతంలో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఐదేళ్ల క్రితం తనను ఓ వ్యక్తి మోసం చేసేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు.
1977లో తాను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయని, అప్పట్లో మాల్‌వేర్ హ్యాకింగ్‌పై ప్రొఫెసర్లు తీవ్రంగా హెచ్చరించేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సైబర్ నేరాల సమస్య కొనసాగుతూనే ఉందన్నారు. తాను కూడా సైబర్ నేరాల బాధితుడినేనని నాగార్జున చెప్పారు. ‘‘ఐదేళ్ల క్రితం ఓ వ్యక్తి బ్యాంక్ అధికారిగా నటిస్తూ, పెట్టుబడుల పేరుతో నన్ను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా విదేశాలకు మాదకద్రవ్యాల పార్సిల్ పంపారంటూ నేరగాళ్లు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా చేశారు. చివరకు నా కుటుంబంలోని కొందరిని మాయమాటలతో భయపెట్టి 6 నుంచి 7 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ చేశారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ డిజిటల్ భద్రతా నియమాలు పాటించాలని నాగార్జున సూచించారు. ‘‘సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండటం, వాటిని అరికట్టడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. నేనైతే ముందు జాగ్రత్తగా వారానికి ఒకసారి మొబైల్ పాస్‌వర్డ్, నెలకు ఒకసారి వైఫై పాస్‌వర్డ్ మారుస్తాను. నా మొబైల్‌లో కనీసం ఫోటోలు కూడా స్టోర్ చేయను’’ అని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సైబర్ పోలీసుల చర్యలను నాగార్జున అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ఇతర దేశాలకు వెళ్లి మరీ అరెస్టులు చేసిన ఘనత తెలంగాణ పోలీసులకే దక్కుతుందన్నారు. అలాగే తెలుగు సినీ రంగంలో పైరసీని అరికట్టడంలో ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, సజ్జనార్ ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. పైరసీ నియంత్రణలో తెలంగాణ పోలీసులు తీసుకున్న కఠిన చర్యల వల్ల కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా, మొత్తం భారతీయ సినీ పరిశ్రమకు ఎంతో మేలు జరిగిందన్నారు.








కామెంట్‌లు (0)