ఆదాయ వ్యయాల మధ్య పెరుగుతున్న అంతరం
దశాబ్ద కాలంగా కేంద్రం దయాదాక్షిణ్యాల పైనే ఆధారం
తగ్గుతున్న వనరుల బదిలీలు
న్యూఢిల్లీ : రాష్ట్రాలు స్వావలంబన సాధించాలని సుద్దులు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ప్రోత్సాహం అందించడం లేదు. సరికదా వివక్షాపూరిత విధానాల ద్వారా రాష్ట్రాలు తనపై ఆధారపడేలా చేస్తోంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2020 మే 12న ఆత్మనిర్భర్ భారత్ అనే మిషన్‌ను 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీతో ప్రారంభించింది. దేశాన్ని స్వయంసమృద్ధి కలిగిన దేశంగా మార్చడమే దీని ఉద్దేశం. స్థానికంగా ఉత్పత్తులను పెంచడం, దిగుమతులను తగ్గించుకోవడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం దీని లక్ష్యాలు. కీలక వనరులను బాహ్య శక్తులు నియంత్రించకుండా నిరోధించడం కూడా దీని ఉద్దేశమే. అయితే ఈ లక్ష్యాల సాధనలో ప్రభుత్వం పూర్తిగా చతికిలపడింది. కేంద్రం బలంగా ఉండాలంటే రాష్ట్రాలు కూడా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఎన్డీఏ పాలనలో రాష్ట్రాలు ఏ చిన్న అవసరం వచ్చినా కేంద్రం వైపు చూసే పరిస్థితి నెలకొంది.
హస్తిన వైపే చూపు
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట ప్రాంగణం నుంచి ప్రసంగిస్తూ భారత్ ఇక ఎవరి పైనా ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇతరులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలంటూ మోడీ ప్రభుత్వం ఎంతగా ప్రచారం సాగిస్తున్నప్పటికీ దానికి భిన్నంగా గత దశాబ్ద కాలంలో మన రాష్ట్రాలు ఢిల్లీ పైనే ఎక్కువగా ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. పదిహేడు సంవత్సరాల కేంద్ర బడ్జెట్ గణాంకాలను విశ్లేషిస్తే ఈ ఆధారపడడం అనేది మరింత అధికమైంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఓ అంతర్గత అసమతుల్యతతో ఏర్పడింది. దీనిని గుర్తించిన రాజ్యాంగ నిర్మాతలు ఆ అసమతుల్యత అవసరమైనదేనని అంగీకరించారు. ఆరోగ్యం, విద్య, పోలీసు వ్యవస్థకు సంబంధించి అయ్యే ఖర్చులను రాష్ట్రాలే భరిస్తాయి. ఇవి పౌరులను నేరుగా ప్రభావితం చేసే సేవలు. అయితే ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వంటి మార్పులకు గురయ్యే, స్థిరమైన పన్నులపై కేంద్రానికి నియంత్రణ ఉంటుంది.
ఆదాయం కంటే ఖర్చే అధికం
విద్య, ఆరోగ్యం వంటి పౌరులకు సంబంధించిన సేవలను స్థానికంగానే మెరుగ్గా నిర్వహించుకోవచ్చు. అయితే సంక్షోభాల సమయంలో ఆర్థిక వ్యవస్థను రాష్ట్రాలు నిర్వహించలేవు. ద్రవ్య సరఫరా, రుణాలపై కేంద్రానికే నియంత్రణ ఉంటుంది. రాబడికి తగిన విధంగానే ఖర్చు ఉండాలనేది ఓ విధానం. ఈ సూత్రాన్ని ఆర్థిక సంఘం కూడా సమర్ధించింది. అయితే ఈ సమన్వయం ఎన్నడూ సాధ్యపడలేదు. రాష్ట్రాల వ్యయం, ఆదాయం మధ్య ఉన్న అంతరం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. కొన్ని అంచనాల ప్రకారం ఈ అంతరం ప్రభుత్వ ఆదాయంలో 60 శాతం వరకూ ఉంటోంది. అంటే రాష్ట్రాలు తాము సమకూర్చుకున్న ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయని అర్థం. ఈ అంతరాన్ని నివారించడానికి ఉద్దేశించిన యంత్రాంగమే అధికార వికేంద్రీకరణ. 2015లో 14వ ఆర్థిక సంఘం పంపిణీ చేయదగిన నిధులలో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. దీని ద్వారా రాష్ట్రాలు కేంద్ర వాటాను గణనీయంగా పొందగలిగాయి. ఫలితంగా కేంద్ర సాయంపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేకపోయింది. అయితే కేంద్రం యొక్క పన్ను రాబడిలో ఈ నిధిలోకి వెళ్లే వాటా తగ్గిపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది.
తగ్గిపోతున్న రాష్ట్రాల వాటా
14వ ఆర్థిక సంఘం పెంచిన వికేంద్రీకరణ రేటు అమలులోకి రాకముందు 2010వ దశకం ప్రారంభంలో నిధిలోకి వెళ్లే వాటా సగటున సుమారు 87 శాతంగా ఉండేది. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరంలో అది 71.6 శాతానికి పడిపోయింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే దేశం స్వావలంబన దిశగా అభివృద్ధి చెందాలని చెబుతున్న కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలు తన విచక్షణ నిర్ణయాలపై ఆధారపడేలా చేస్తోంది. కోవిడ్ మహమ్మారి విరుచుకుపడిన సమయంలో...అంటే 2020-21లో వికేంద్రీకరణ, గ్రాంట్లు, రుణాలు సహా రాష్ట్రాలకు చేసిన మొత్తం బదిలీలు గరిష్ట స్థాయికి (59.1 శాతం) చేరుకున్నాయి. ఆ సంవత్సరంలో కోవిడ్ కారణంగా కేంద్రం యొక్క పన్ను, పన్నేతర రాబడులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రాలకు 2021-23 వరకూ గణనీయ స్థాయిలో బదిలీలు కొనసాగాయి. ఆ తర్వాత కేంద్రం ఆర్థికంగా కోలుకోవడంతో 2024-25 నాటికి బదిలీలు 51 శాతానికి తగ్గిపోయాయి. రాష్ట్రాలకు అత్యంత అవసరమైన సమయంలోనే బదిలీలు తగ్గడం గమనార్హం. కేంద్ర నిబంధనలు, విచక్షణ ఆధారంగానే బదిలీలు జరిగాయి. రాష్ట్రాలకు హక్కుగా రావాల్సిన ఆదాయం, కేంద్రం తన విచక్షణతో విదిల్చిన నిధుల మధ్య అంతరం బాగా పెరిగిపోయింది.







కామెంట్‌లు (0)