సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది : ఆదిత్య హాసన్

1 గంట క్రితం

‘Epic – First Semester’ is winning the hearts of the audience: Aditya Hasan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 02:39 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం


'90s' వెబ్ సిరీస్ బాటలోనే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ కూడా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది : చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్


ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. యువతలో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ‘ఎపిక్’ చిత్రం, సెప్టెంబర్ 11న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


మీ కుటుంబ నేపథ్యం ఏంటి? సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు ?

- మాది వనపర్తి. టెన్త్ వరకు అక్కడే చదువుకున్నాను. మా నాన్న స్కూల్ టీచర్ గా రిటైర్ అయ్యారు. అమ్మ హౌస్ వైఫ్. అన్న, వదిన బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నారు. టెన్త్ తర్వాత నాకు సినిమాపై ఆసక్తి పెరిగింది. ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయలేదు. హైదరాబాద్ లో డిగ్రీ చదివి, ఆ తర్వాత మాస్టర్స్ కోసం యూకే వెళ్ళాను. అప్పటికే షార్ట్ ఫిలిమ్స్ చేసిన నేను, యూకే నుంచి తిరిగి వచ్చిన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆరు నెలల తర్వాత కలర్స్ స్వాతి గారితో 'టీచర్' అనే సినిమా చేశాను. నవీన్ మేడారం గారు, అభిషేక్ నామా గారు నిర్మించిన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. యూకేలో నేను చదువుకున్న యూనివర్సిటీలో నవీన్ గారు సీనియర్. సినిమాల పట్ల ఆసక్తితో ఆయనను సంప్రదించి, పరిచయం చేసుకున్నాను.


90s వెబ్ సిరీస్ అవకాశం ఎలా వచ్చింది ?

- మా నాన్న గారి నిజజీవితం ఆధారంగా 90s కథ రాసుకున్నాను. మొదట ఒక ఓటీటీ సంస్థ ఆ కథ నచ్చి, నిర్మించడానికి ముందుకొచ్చింది. కానీ, ఆరు నెలల తర్వాత వెనకడుగు వేశారు. అప్పటికే ఆ కథ గురించి తెలిసిన ఈటీవీ విన్ సాయి గారు, నితిన్ గారు పిలిచారు. అలా 90s వెబ్ సిరీస్ తెరపైకి వచ్చింది.


మీకు ఆదిత్య హాసన్ పేరు ఎలా వచ్చింది ?

- నా అసలు పేరు ఆదిత్య. నేను కమల్ హాసన్ గారి వీరాభిమానిని. ఆ అభిమానంతోనే నా పేరును ఆదిత్య హాసన్ గా మార్చుకున్నాను.


'ఎపిక్' సినిమా మీ బయోపిక్ అంటున్నారు నిజమేనా ?

- నిజ జీవిత సంఘటనల స్ఫూర్తి ఖచ్చితంగా ఉంటుంది. కానీ, నా జీవితం మాత్రం అంత అందంగా లేదు (నవ్వుతూ). ఎంతో కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాము. 90s సిరీస్ లో కూడా మా ఊరిపేరు, మా కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి. కానీ, అందులోని ప్రతి సంఘటన మా జీవితంలో జరిగినట్లు కాదు. వివిధ జీవితాల్లోని సంఘటనలను తీసుకొని, ఒక కథగా రాసుకోవడం జరిగింది.


'ఎపిక్' సినిమా ఎలా ఉండబోతుంది ?

- ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. మన నిజ జీవితంలోని కొన్ని కొన్ని అందమైన సంఘటనల ఆధారంగా కథ ఉంటుంది. 90s సిరీస్ కు ఇది సీక్వెల్. అందులోని తమ్ముడి పాత్రకు సంబంధించిన జీవితంలోని ఒక భాగం ఎపిక్ కథగా ఉంటుంది. ఆ తర్వాత అన్న జీవితాన్ని ఒక కథగా, అక్క జీవితాన్ని ఒక కథగా చూపించే ఆలోచన ఉంది.


'ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్' అని టైటిల్ పెట్టడానికి కారణమేంటి ?

- 'ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్' కథకు కొనసాగింపు ఉంటుంది. 'ఎపిక్- ఫైనల్ సెమిస్టర్' పేరుతో ఆ కథ కొనసాగుతుంది. మొదటి భాగంలో ముగింపు కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల కోణంలోనో, దర్శకుడి కోణంలోనో కాకుండా ఆ కథకు ఎలాంటి ముగింపు అవసరమో, అలాంటి క్లైమాక్స్ రాయడం జరిగింది.


బేబీ జోడితో సినిమా చేయడం ఏమైనా ఒత్తిడి అనిపించిందా ?

- మొదట్లో అనిపించింది. కానీ, దానిని బ్రేక్ చేసేలా 'ఎపిక్' సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. హీరోగా ఆనంద్ ను నేనే ఎంపిక చేశాను. హీరోయిన్ గా వైష్ణవి పేరుని నిర్మాత నాగవంశీ గారు సూచించారు. 'బేబీ' కాంబో కమర్షియల్ గా హెల్ప్ అవుతుందని ఆయన అన్నారు. అప్పుడు ఆయన అన్నప్పుడు అర్థం కాలేదు కానీ, తర్వాత సినిమాపై వచ్చిన హైప్ చూశాక ఆయన చెప్పింది కరెక్ట్ అని అర్థమైంది.


'ఎపిక్' గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు ?

- ఇది గొప్ప కథ అని చెప్పను. ఒక యువకుడు హైదరాబాద్ నుంచి యూకే వెళ్తాడు. అక్కడ ఒకమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది కథ. 90s ఎలాగైతే సహజంగా ఉంటుందో, ఎపిక్ కూడా అంతే సహజంగా ఉంటుంది. కొన్ని కొన్ని సంఘటనలు గుర్తుండిపోతాయి. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల గురించి, అక్కడి బంధాల గురించి ఎక్కువగా సినిమాలు రాలేదు. పైగా, నేను అక్కడ చదువుకున్నాను కాబట్టి, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అది కొత్తగా ఉంటుంది అనిపించి, ఈ కథ ప్రేక్షకులకు చెప్పాలి అనుకున్నాను.


నిర్మాత నాగవంశీ గారి గురించి ?

- 90s వెబ్ సిరీస్ చూసి, నన్ను నమ్మి నాగవంశీ గారు ఈ అవకాశం ఇచ్చారు. ప్రతిదీ దగ్గరుండి వంశీ గారు చూసుకున్నారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఎంపిక కూడా వంశీ గారిదే.


గోరటి వెంకన్న గారు ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

- నాకు చిన్నప్పటి నుంచి గోరటి వెంకన్న గారంటే అభిమానం. నేను లండన్ లో చదువుకునే రోజుల్లో కూడా ఆయన పాటలే వింటూ ఉండేవాడిని. నా మొదటి సినిమాలో ఖచ్చితంగా ఆయన పాట ఉండాలి అనుకునేవాడిని. అందుకే ఎపిక్ సినిమాలో గోరటి వెంకన్న గారితో 'సంచారమే' రాయించి, పాడించి.. ఆ పాటతోనే ప్రమోషన్స్ మొదలుపెట్టాము.


మీకు ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది ?

- అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. వినోదాన్ని అందిస్తూనే, విభిన్న జానర్ సినిమాలు చేయాలని ఉంది. ఎవరినీ కించపరచకుండా, ఎటువంటి అజెండాలు లేకుండా విలువలతో కూడిన సినిమా అందించాలనేది నా లక్ష్యం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్