డ్రగ్స్, హింసాత్మక దృశ్యాలపై సీబీఎఫ్‌సీ కఠిన మార్గదర్శకాలు
న్యూఢిల్లీ : భారతీయ సినిమాల్లో సున్నితమైన అంశాల చిత్రీకరణపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) కోసం 1991 నాటి పాత మార్గదర్శకాల స్థానంలో ఈ కొత్త సవరణలను ప్రకటించగా, ఇవి తక్షణమే అమలులోకి వచ్చాయి.
కొత్త మార్గదర్శకాలలోని ముఖ్య అంశాలు ....
మత్తుపదార్థాల ప్రదర్శనపై హెచ్చరిక : సినిమాల్లో డ్రగ్స్ వాడకం లేదా అక్రమ రవాణాకు సంబంధించిన సన్నివేశాలు వచ్చినప్పుడు “Illicit narcotics destroy health and guarantees imprisonment. Say No To Drugs” అనే సందేశాన్ని తెరపై తప్పనిసరిగా ప్రదర్శించాలి. మద్యం, పొగాకు, మత్తుపదార్థాల అలవాట్లను ప్రోత్సహించేలా లేదా గొప్పగా చూపించే సన్నివేశాలపై నిషేధం ఉంటుంది.
హింస & లైంగిక వేధింపులు : హింసను సమర్థించే దృశ్యాలకు తావులేదు. మహిళలను కించపరచడం, లైంగిక వేధింపులు, హింసాత్మక దృశ్యాలను కథాంశానికి అత్యంత అనివార్యమైతే తప్ప చూపించకూడదు. ఒకవేళ ఉన్నా చాలా పరిమితంగా మాత్రమే ఉండాలి.
చిన్నారులు, దివ్యాంగులు, జంతువుల రక్షణ : పిల్లలను హింసకు బాధితులుగా లేదా నేరస్థులుగా చూపించకూడదు. వారిపై ఎలాంటి వేధింపుల చిత్రీకరణకూ అనుమతి ఉండదు. దివ్యాంగులను అవమానించేలా, పరిహాసం చేసేలా ఉండే సన్నివేశాలు, జంతువులపై అనవసరమైన క్రూరత్వాన్ని ప్రదర్శించకూడదు.
సామాజిక, చట్టపరమైన బాధ్యత : మతాలు, విభిన్న వర్గాల భావాలను దెబ్బతీసే సంభాషణలు, సామాజిక విద్వేషం, మూఢనమ్మకాలు, శాస్త్రవిరుద్ధమైన భావాలు, దేశ వ్యతిరేక అంశాలు, న్యాయస్థానాల గౌరవానికి భంగం కలిగించే కంటెంట్‌పై ఆంక్షలు కొనసాగుతాయి.
వయస్సు వర్గీకరణ, టైటిళ్ల పరిశీలన : 2025 మేలో ప్రారంభించిన U/A 7+, U/A 13+, U/A 16+ వయసు ఆధారిత సర్టిఫికేషన్ విధానమే మున్ముందూ కొనసాగుతుంది. వీటితో పాటు సినిమాల పేర్లు (టైటిళ్లు) అసభ్యకరంగా, రెచ్చగొట్టేలా లేదా అభ్యంతరకరంగా ఉన్నాయా అనే విషయాన్ని కూడా సీబీఎఫ్‌సీ ప్రత్యేకంగా పరిశీలిస్తుంది.







కామెంట్‌లు (0)