హైదరాబాద్ : ''బహుశా.. జీవితం అంటే ఇదేనేమో ? ’’ అంటూ సినీనటి రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో తన భావాలను పంచుకున్నారు. రష్మిక మందన్న ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇంట్లో తన రోజువారీ జీవితం ఎలా సాగుతోందో తెలియజేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఎప్పుడూ షూటింగ్‌లు, ప్రయాణాలతో బిజీగా ఉండే వారికి విశ్రాంతి తీసుకోవడం కూడా కొంత కొత్తగా, భయంగా అనిపిస్తుందని రష్మిక పేర్కొన్నారు. ‘‘ క్షణం తీరిక లేకుండా గడిపేవారికి విశ్రాంతి అనేది భయంగా అనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినప్పుడు బిజీగా గడిచిన పాత రోజులను గుర్తు చేసుకుంటే భయం పుడుతుంది. బహుశా.. జీవితం అంటే ఇదేనేమో ? ’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన భావాలను పంచుకున్నారు. ప్రస్తుతం అభిమానులు, శ్రేయోభిలాషులు చూపిస్తున్న ప్రేమానురాగాల్లో మునిగితేలుతున్నానని, సానుకూల వాతావరణంలో సమయాన్ని గడుపుతున్నానని రష్మిక తెలిపారు.
‘మైసా’ షూటింగ్‌లో గాయం ....
రష్మిక ప్రస్తుతం రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమెకు గాయమైన విషయం తెలిసిందే. ఓ పాటకు డ్యాన్స్ చేస్తున్న సమయంలో తుంటి భాగంలో బలమైన గాయం కావడంతో వైద్యులు ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. కథానాయిక ప్రాధాన్యంతో తెరకెక్కుతున్న ‘మైసా’లో రష్మిక గోండు తెగకు చెందిన మహిళ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








కామెంట్‌లు (0)