హైదరాబాద్ : కర్నాటక సంగీత రంగానికి చెందిన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు హెచ్.ఎన్. భాస్కర్ అమెరికాలో అరెస్టు కావడం సంగీత పరిశ్రమలో కలకలం రేపింది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నమోదైన కేసులో ఆయన అరెస్టు కావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ వరుస పోస్టులు చేశారు.
ఈ వ్యవహారంలో బాధితులకు అండగా నిలిచిన చిన్మయి .. తనకు పలువురు బాధితుల నుంచి సందేశాలు వస్తున్నాయని వెల్లడించారు. సదరు వయోలిన్ విద్వాంసుడిపై గతంలోనూ ఆరోపణలు వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, బాధితుల అనుభవాలను, వారు పంపిన సందేశాలను వారి అనుమతి లేకుండా బహిర్గతం చేయలేనని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో కలిసి పనిచేసే మహిళలు సహా సంగీత రంగానికి చెందిన పలువురు ఈ అంశంపై మౌనం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల్లో చాలామంది చిన్న వయసువారేనని, కొన్ని ఘటనలు పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని చిన్మయి పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సానుభూతితో వ్యవహరించే న్యాయవాదులను పరిచయం చేసి, న్యాయపరంగా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. బాధితులంతా ధైర్యంగా ముందుకొచ్చి ఐక్యంగా ఫిర్యాదు చేయాలని, వారికి తగిన మద్దతు లభిస్తుందని చిన్మయి పిలుపునిచ్చారు. ఇప్పటికే ధైర్యంగా తమ అనుభవాలను బయటపెట్టిన బాధితులకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. ఈ వ్యవహారంలో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని కోరారు.








కామెంట్‌లు (0)