హైదరాబాద్ : టాలీవుడ్‌లో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అర్జున్ రెడ్డి’తో మొదలైన వీరి ప్రయాణం సినిమా విజయంతో పాటు వ్యక్తిగతంగా కూడా మంచి అనుబంధంగా మారింది. ఇద్దరూ తమ తమ కెరీర్‌లలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆ స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంది.
‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదగగా.. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయినా ఇద్దరి మధ్య స్నేహం ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల సందీప్ నిర్మించిన ‘రోమాంచకం’ చిత్రానికి విజయ్ దేవరకొండ మద్దతుగా నిలిచి, సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొన్నారు.
తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘ఎపిక్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి విజయ్ దేవరకొండ కూడా హాజరయ్యారు. దీంతో చాలాకాలం తర్వాత ఇద్దరు స్నేహితులు ఒకే వేదికపై సందడి చేశారు.
ఈ సందర్భంగా తమ కొత్త ప్రాజెక్టులు, సినిమా విశేషాలపై మాట్లాడుకున్న విజయ్, సందీప్ మధ్య ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. విజయ్ దేవరకొండ తన అభిమాన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఓ ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. విజయ్ ఇచ్చిన గిఫ్ట్‌ను సందీప్ వెంటనే ధరించడంతో అక్కడున్నవారి దృష్టిని ఆకర్షించింది.
ఈ సన్నివేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్-సందీప్ మధ్య ఉన్న స్నేహం, ఆత్మీయతకు ఈ గిఫ్ట్ మరో నిదర్శనమంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.







కామెంట్లు (0)