న్యూఢిల్లీ : విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, నీట్-యుజి నిరసనలకు సంబంధించి గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ (జిబియు) విద్యార్థికి ఉత్తరప్రదేశ్ మేజిస్ట్రేట్ షోకాజ్ నోటీసు జారీ చేయడంపై సుప్రీంకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేటర్ నోయిడా కమిషనరేట్‌లోని మూడో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విద్యార్థి అక్షత్ త్రిపాఠికి ఈ నోటీసు జారీ చేయగా, కొద్దిసేపటికే ఉపసంహరించుకున్నారు. ‘‘విద్యార్థులపై బలవంతపు చర్యలు తీసుకోకూడదని స్పష్టంగా ఆదేశించినప్పటికీ మేజిస్ట్రేట్ నోటీసు ఎలా జారీ చేశారు? ఆయనకు ఎంత ధైర్యం?’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. నోటీసు జారీపై మేజిస్ట్రేట్ నుంచి వివరణ కోరతామని తెలిపారు.
రూ.5 లక్షల వ్యక్తిగత పూచీకత్తు ఎందుకు సమర్పించకూడదో కారణం చూపాలని నోటీసులో అక్షత్ త్రిపాఠిని మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఆయన ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొనాలని ఇతర విద్యార్థులను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది బిశ్వజిత్ భట్టాచార్య సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మేజిస్ట్రేట్ చర్య సుప్రీంకోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొన్నారు. నోటీసు ఉపసంహరించుకున్నప్పటికీ, ఇప్పటికే జరిగిన ధిక్కారం తొలగిపోదని ఆయన అన్నారు. దీనిపై స్పందించిన సిజెఐ.. ‘‘మేము ఆయన వివరణ కోరతాం. ఆయనే వివరించనివ్వండి’’ అని అన్నారు.
నీట్-యుజి ప్రశ్నాపత్రాల లీకేజీలను వ్యతిరేకిస్తూ జులై 20 నుండి 25 మధ్య జరిగిన నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ‘‘పూర్తి న్యాయం’’ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తన అధికారాలను వినియోగించిన కోర్టు.. ఎఫ్‌ఐఆర్‌లపై దర్యాప్తు జరగకుండా వాటిని మూసివేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదని, నిరసనలు జరిగిన ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది.







కామెంట్‌లు (0)