సామాన్య కళాకారుల జీవితాలు వెండితెరపైకి రావడం ఆహ్వానించదగ్గ విషయం. ఇటీవల తెలుగులో జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పుడు మహారాష్ట్రకు చెందిన మరో జానపద కళాకారిణి విఠాబాయి జీవితం కూడా వెండితెరపైకి వస్తోంది. 'ఈతా' పేరుతో హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమాషా కళకు జీవితాన్ని అంకితం చేసిన విఠాబాయి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. తొమ్మిది గజాల చీర కట్టి, కాళ్లకు గజ్జెలు కట్టి, హావభావాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆమె వేదికపై తమాషా సామ్రాజ్ఞిగా పేరు తెచ్చుకున్నారు. కానీ నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన ఈ కళాకారిణి చివరి రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తోటి కళాకారుల సంక్షేమం కోసం కూడా పోరాడారు. ఆమె జీవితం ఇప్పుడు వెండితెర మీద ఆవిష్కృతం కాబోతోంది. విఠాబాయిని ప్రేమగా 'ఈతా' అని పిలిచేవారు. ఆ పిలుపునే సినిమాకు టైటిల్‌గా పెట్టారు.
తమాషా.. మహారాష్ట్ర జానపద కళ
మహారాష్ట్రలో తమాషా అనేది పాటలు, నృత్యాలు, హాస్యం, సంభాషణలు, చిన్న నాటకీయ సన్నివేశాలతో కూడిన కళారూపం. గ్రామీణ ప్రజల జీవితాలు, సామాజిక సమస్యలు, పురాణాలు, చరిత్ర, ప్రేమ, హాస్యం వంటి అంశాలు ఇందులో చోటుచేసుకుంటాయి. ఈ కళారూపం రాజుల ఆస్థానాల నుంచి గ్రామీణ జాతరలు, బహిరంగ ప్రదర్శన వేదికల వరకు విస్తరించింది. దీని మూలాలు మహారాష్ట్రలోని గోంధల్, దశావతార్, పవాడాలు, గవలన్ వంటి జానపద కళా సంప్రదాయాల్లో కనిపిస్తాయి. పేష్వాల కాలంలో రాజాస్థానాలు, సైనిక శిబిరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిగేవి. గ్రామాల వెలుపల పెద్ద టెంట్లు ఏర్పాటు చేసి రాత్రంతా ప్రదర్శనలు నిర్వహించేవారు. ప్రజలు కుటుంబాలతో సహా వచ్చి వీటిని చూసేవారు. తమాషా బృందాలు ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలు ఇవ్వడం సంప్రదాయంగా కొనసాగింది.
ఈ ప్రదర్శనల్లో పాటలు, నృత్యాలతో పాటు హాస్య సంభాషణలు, సామాజిక వ్యాఖ్యానాలు కూడా ఉంటాయి. సామాజిక సమస్యలు, చారిత్రక సంఘటనలు, పురాణ కథలను హాస్యంతో మేళవించి చెబుతారు. దోల్కీ, హల్గీ, తుంటునే, మంజీరాల శబ్దాలు ప్రదర్శనకు ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. కళాకారుల చమత్కార సంభాషణలు, అప్పటికప్పుడు ప్రేక్షకుల మాటలకు స్పందిస్తూ చెప్పే మాటలు ప్రత్యేక ఆకర్షణ. తమాషాకు ప్రాణం లావణి నృత్యం. వేగవంతమైన తాళం, భావోద్వేగంతో కూడిన పాటలు, చురుకైన కదలికలతో లావణి నృత్యం అలరిస్తుంది. తొమ్మిది గజాల చీర, నుదుటి బొట్టు, ఆభరణాలు, కాళ్లకు గజ్జెలు ధరించిన కళాకారిణి వేదికపై చేసే నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేమ, విరహం, సామాజిక పరిస్థితులు, జీవిత అనుభవాలు లావణి పాటల ఇతివృత్తాలుగా ఉంటాయి. మహారాష్ట్రలో తమాషా, లావణి ప్రదర్శనలకు విపరీతమైన ఆదరణ ఉండేది. అయితే, ఈ కళారూపానికి ఆదరణ ఎంత విస్తృతంగా ఉన్నా, ఇందులో పాల్గొనే మహిళా కళాకారిణులు మాత్రం సామాజిక వివక్షను ఎదుర్కొన్నారు. తమాషా కళను అసభ్యమైన వినోదంగా ముద్ర వేసిన సందర్భాలూ ఉన్నాయి. మహిళా కళాకారిణుల శ్రమ, ప్రతిభ, కళాత్మకత కంటే వారి వ్యక్తిగత జీవితాలపై ఆసక్తి చూపిన సామాజిక దృష్టి వారి జీవితాలను మరింత కష్టతరం చేసింది.
వేదికపై వెలుగులు.. జీవితంలో చీకట్లు
1935 జూలై 1న మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పంఢర్‌పూర్‌లో విఠాబాయి జన్మించారు. మాంగ్ సామాజిక వర్గానికి చెందిన ఆమె కుటుంబం తరతరాలుగా జానపద కళను నమ్ముకుని జీవించింది. ఆమె తాత నారాయణ్ ఖుడే తమాషా కళా బృందాన్ని ప్రారంభించగా, తండ్రి భౌ బాపు నారాయణ్గావ్కర్ తదితరులు దానిని కొనసాగించారు. చిన్నతనం నుంచే తమాషా ప్రదర్శనల మధ్య పెరిగిన విఠాబాయికి లావణి, గవలన్, భేదిక్ వంటి పాటలు, నృత్యాలు సహజంగానే అబ్బాయి. ఏడేళ్ల వయసు నుంచే వేదికపై ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులకు తోడ్పడటానికి కళనే జీవనాధారంగా చేసుకున్న ఆమె, తన ప్రతిభతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు.
గర్భిణిగా ఉన్న సమయంలోనూ విఠాబాయి తమాషా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఓ ప్రదర్శన మధ్యలోనే పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వేదిక వెనుకకు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె, బిడ్డ బొడ్డుతాడును రాయితో కోసినట్లు చెబుతారు. ప్రసవించిన కొద్దిసేపటికే తిరిగి వేదికపైకి వచ్చి ప్రదర్శన కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ప్రదర్శనను ఆపి ఆమె విశ్రాంతి తీసుకోవాలని కోరారట! కళ పట్ల ఆమెకున్న అంకితభావానికి ఈ ఘటన నిదర్శనం.
విఠాబాయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు పొందారు. తమాషా, లావణి కళల్లో ఆమె ప్రదర్శనలకు విశేష ఆదరణ లభించింది. ఆమె ప్రతిభను గుర్తించిన పలువురు ప్రముఖులు సినిమాల్లో నటించే అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నించినట్లు కథనాలున్నాయి. ఆమె తనకు జీవనాధారమైన తమాషా కళకే ప్రాధాన్యం ఇచ్చారు. 1962లో భారత్-చైనా యుద్ధ సమయంలో సైనికుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారామె. 1957, 1990ల్లో ఆమెకు రాష్ట్రపతి గౌరవాలు లభించాయి. అభిమానులు ఆమెను 'తమాషా సామ్రాజ్ఞి'గా పిలుచుకునేవారు. వేలాది మంది ప్రేక్షకులను అలరించిన ఆమె జీవితంలో మాత్రం ఆర్థిక భద్రత కొరవడింది. ఆమె కళాకారుల సంక్షేమం కోసం పోరాడారు. చివరి రోజుల్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 2002 జనవరి 15న పక్షవాతంతో విఠాబాయి కన్నుమూశారు. ఆమె మరణానంతరం కుటుంబ సభ్యులు ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళాభిమానులు, సాంస్కృతిక సంస్థలు, కొందరు ప్రముఖులు ఆర్థిక సహాయం అందించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. విఠాబాయి సేవలను గుర్తిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2006లో ఆమె పేరుతో 'విఠాబాయి నారాయణ్గావ్కర్ జీవితకాల సాఫల్య పురస్కారం' ప్రారంభించింది. తమాషా కళ పరిరక్షణ, అభివృద్ధికి జీవితకాలం కృషి చేసిన సీనియర్ కళాకారులకు ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు.
విఠాబాయి జీవిత కథ ఆధారంగా 'ఈతా' సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ విఠాబాయి పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం విఠాబాయి జీవితంలోని కష్టాలు, కళ పట్ల ఆమె అంకితభావంతో పాటు మహారాష్ట్ర సంప్రదాయ తమాషా కళ, లావణి నృత్యం, జానపద కళాకారుల జీవితాల్లోని సమస్యలను మరోసారి చర్చకు తీసుకురానుంది.








కామెంట్లు (0)