శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మూగబోయిన ఐదు తరాల స్వరం

1 గంట క్రితం

janaki
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 01:54 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

  • ఒక గొంతు ఐదు తరాల కథానాయికలకు ప్రాణం పోసింది. ఒక గాత్రం... ప్రేమలోని తొలిచూపును పలికించింది.
 విరహంలో కన్నీటిని ఒలికించింది. తల్లి లాలిపాటగా మారింది. భక్తి గీతంలో భక్తి రసాన్ని నింపింది. 
జానపదంలో పల్లె పరిమళాన్ని వెదజల్లింది. శాస్త్రీయ సంగీతంలో రాగాల ఔన్నత్యాన్ని ఆవిష్కరించింది. ఇప్పుడు ఆ స్వరం శాశ్వత మౌనంలో కలిసిపోయింది.

  • ‘జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె ప్రతి రోజూ కొన్ని లీటర్ల తేనే తాగుతుంటుంది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా’ ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇళయరాజా

1950 వ దశకంలో జమున, సావిత్రిలతో మొదలు పెట్టి, 2000 దశకం ప్రారంభం వరకు ఐదు తరాల కథా నాయికలకు తన గాత్రాన్ని అందించి దక్షిణ భారత సినీ సంగీతాన్ని తన గానమాధుర్యంతో పరవశింపజేసిన ఎస్. జానకి ఇక లేరు. వయోభారంతో ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా 88వ ఏట ఆమె కన్నుమూయడంతో భారతీయ సినీ సంగీతంలో ఒక గొప్ప యుగానికి తెరపడింది. 1938 ఏప్రిల్‌ 23న గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో శిష్ట్ల శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జానకి జన్మించారు. తండ్రి ఆయుర్వేద వైద్యుడు. ఇంట్లో సంగీతానికి అనుకూల వాతావరణం ఉండేది. చిన్నప్పటి నుంచే పాటలంటే ఆమెకు అపారమైన ఆసక్తి. తొమ్మిదేళ్ల వయసులోనే వేదికపై పాట పాడి అందరి ప్రశంసలు అందుకున్నారు. నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీత మౌలికాంశాలను జానకీ నేర్చుకున్నారు. అయితే, సంప్రదాయ శాస్త్రీయ సంగీతంలో సుదీర్ఘ శిక్షణ పొందలేదు. సహజసిద్ధమైన గాత్రం, అద్భుతమైన శ్రుతిశుద్ధి, అపూర్వమైన సాధనే ఆమెను భారతదేశపు అత్యున్నత నేపథ్య గాయనిగా నిలబెట్టాయి.

​ఎవిఎం స్టూడియోతో...

కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మద్రాసుకు వెళ్లిన జానకి, ఎవిఎం స్టూడియో నిర్వహించిన గాయకుల ఎంపికలో అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. 1957లో సినీ గాయనిగా ప్రారంభమైన ఆమె ప్రయాణం ఆ తర్వాత ఆరు దశాబ్దాలపాటు నిర్విరామంగా సాగింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు ఇరవైకి పైగా భాషల్లో 50 వేలకుపైగా పాటలు ఆలపించి ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన గాయనుల్లో ఒకరిగా నిలిచారు. అయితే, ఆమె గొప్పతనం కేవలం వేలాది పాటలు పాడటంలో లేదు. తెరపై కనిపించే నటీమణి వయసు, స్వభావం, భావోద్వేగానికి అనుగుణంగా తన గొంతును మార్చుకోవడంలో ఉంది. చిన్నారి పాత్ర అయితే పిల్లలా, యువతి అయితే చిలిపిగా, తల్లి అయితే మాతృస్నేహంతో, వృద్ధురాలు అయితే స్వరంలో ఆ మార్పును పలికిస్తూ పాడగలిగిన అరుదైన గాత్రశిల్పి ఆమె. అందుకే ఆమె ఐదు తరాల స్వరంగా... తరగని గళంగా నిలిచారు. సావిత్రి, జమున, కృష్ణకుమారి, అంజలీదేవి వంటి తొలి తరం కథానాయికలతో ప్రారంభమైన ఆమె గానయాత్ర, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, లక్ష్మి వరకు సాగింది. ఆ తర్వాత శ్రీదేవి, సుహాసిని, రాధ, భానుప్రియ, అమల, రేవతి, విజయశాంతి వంటి నటీమణులు నటించిన పాటలు ఆమె స్వరంతోనే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచాయి. అక్కడితో ఆగలేదు. రంభ, నగ్మా, మీనా, సౌందర్య, రమ్యకృష్ణ వంటి మరో తరం నటీమణులకు కూడా ఆమె గాత్రమే అలంకారమైంది. చివరికి శ్రియ శరణ్ (2000 దశాబ్ధపు కొత్త తరం కథానాయిక)కు కూడా ఆమె స్వరం వినిపించింది. ఇంత సుదీర్ఘ సినీ ప్రయాణం సాగడం భారతీయ సినీ సంగీతంలో అపురూపం!

సిరిమల్లె పువ్వా అన్నా....

''సిరిమల్లె పువ్వా..." అంటూ అమాయక ప్రేమను పలికించినా, "మౌనమేలనోయి..." అంటూ ప్రేమలోని నిశ్శబ్దాన్ని ఆలపించినా, "వెన్నెల్లో గోదారి అందం..." అంటూ గోదావరి అందాలను గానంలో బంధించినా, ప్రతి పాటలోనూ జానకమ్మ తనను తాను మరచిపోయి పాత్రలోకి ప్రవేశించేవారు. అందుకే ఆమె పాటలు వినిపించినప్పుడు తెరపై కేవలం నటులు కనిపించరు. ఆ పాత్ర ఆత్మ ప్రేక్షకులకు వినిపిస్తుంది. ఘంటసాల, పెండ్యాల, కె.వి. మహదేవన్, సత్యం, చక్రవర్తి, ఇళయరాజా, రాజ్–కోటి, ఎం.ఎం. కీరవాణి, ఏ.ఆర్. రెహమాన్... ఇలా సంగీత దర్శకులు మారినా, కాలం మారినా, సాంకేతికత మారినా ఆమె స్వర మాధుర్యం మాత్రం మారలేదు. ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.జె. యేసుదాస్, పి.బి. శ్రీనివాస్, మానో వంటి గాయకులతో కలిసి ఆమె పాడిన యుగళ గీతాలు తెలుగు సినీ సంగీతానికి చిరస్థాయి సంపదగా నిలిచిపోయాయి. ప్రేమగీతాలు, విషాదగీతాలు, శాస్త్రీయ సంగీతం, జానపద గీతాలు, పిల్లల పాటలు, భక్తి గీతాలు, హాస్య గీతాలు... ఏ ప్రక్రియలోనైనా ఆమె తనదైన ముద్ర వేశారు. పాట పాడటం కాదు... పాత్రను పాడటం అంటే ఏమిటో ఎస్. జానకి నిరూపించారు. అందుకే సంగీతాభిమానులు ఆమెను ప్రేమగా "జానకమ్మ" అని పిలిచేవారు. దక్షిణాది సినీ సంగీత ప్రపంచం మాత్రం ఆమెను "గానకోకిల"గా ఆరాధించింది.తెలుగు చిత్రసీమలో "సిరిమల్లె పువ్వా", "ఝుమ్మంది నాదం", "మౌనమేలనోయి", "వెన్నెల్లో గోదారి అందం", "మాటరాని మౌనమిది", "మళ్లీ మళ్లీ ఇది రాని రోజు", "ప్రియతమా...", "నరుడా ఓ నరుడా...", "ఎర్రని కుర్రని గోపాలా..." వంటి పాటలు ఆమె గాన వైవిధ్యానికి చిరస్మరణీయ నిదర్శనాలు. ఈ పాటలు కేవలం అప్పటి తరాన్ని మాత్రమే కాదు, నేటి యువతను కూడా అలరిస్తూనే ఉన్నాయి.

​ఎన్నో అవార్డులు...

గుర్తింపులు, పురస్కారాల విషయంలో కూడా జానకి ఒక శిఖరాగ్రాన్ని అందుకున్నారు. భారతీయ సినీ సంగీతంలో అత్యున్నత గౌరవంగా భావించే నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను ఆమె అందుకున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డజన్ల కొద్దీ ఉత్తమ గాయని అవార్డులను అందుకున్నారు.

awards

movie

​ఇళయరాజా స్వరాలకు జానకమ్మ ప్రాణం

సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరకల్పనలకు అత్యంత న్యాయం చేసిన గాయనీమణుల్లో ఎస్. జానకి మొదటి వరుసలో ఉంటారు. క్లిష్టమైన రాగాలైనా, అత్యంత సున్నితమైన భావోద్వేగాలైనా, జానపద బాణీలైనా—ఏ పాటనైనా జానకి తన గాత్రంతో కొత్త స్థాయికి తీసుకెళ్లారు. సాగర సంగమం, సితార, గీతాంజలి, ఆలాపన, మహర్షి వంటి చిత్రాల్లో ఇళయరాజా స్వరపరిచిన ఎన్నో పాటలు నేటికీ సంగీతాభిమానుల పెదవులపై ఉన్నాయి. "వెన్నెల్లో గోదారి అందం", "మౌనమేలనోయి", "ప్రియతమా...", "ఓం నమః..." వంటి గీతాలు సంగీత దర్శకుడి ప్రతిభకు, గాయనిగా జానకి భావవ్యక్తీకరణకు నిలువెత్తు నిదర్శనాలు. ఇళయరాజా స్వరాల్లో వినిపించిన జానకి గాత్రం దక్షిణ భారత సినీ సంగీతానికి ఒక ప్రత్యేక అధ్యాయం.​

తెలుగు సినీ సంగీత స్వర్ణయుగం...

​తెలుగు సినీ సంగీత చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన యుగళ గాయకుల జోడీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం–ఎస్. జానకీనే. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఈ ఇద్దరి గాత్రాలు కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించాయి. ప్రేమ గీతాలు, విరహ గీతాలు, జానపద గీతాలు, శాస్త్రీయ సంగీత ఆధారిత గీతాలు... ఏ తరహా పాటైనా వీరిద్దరూ అద్భుతంగా ఆలపించేవారు. సంగీత దర్శకులు కూడా యుగళ గీతం అంటే ముందుగా ఈ జోడీనే ఎంపిక చేసేవారు. "మౌనమేలనోయి...", "మాటరాని మౌనమిది...", "మళ్లీ మళ్లీ ఇది రాని రోజు...", "ప్రియతమా...", "ఓం నమః...", "జాబిల్లి కోసం...", "మనసా తుళ్లిపడకే..." వంటి ఎన్నో పాటలు ఈ ఇద్దరి గాత్రంతోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెరపై హీరో–హీరోయిన్లు కనిపించినా, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది మాత్రం ఎస్‌‌పిబి- జానకీ గాత్రాలే. తెలుగు సినీ సంగీత స్వర్ణయుగానికి ఈ ఇద్దరూ చిరస్మరణీయ ప్రతీకలు.

ఈ దుర్యోధన.. దుశ్శాసన ..

1985లో విడుదలైన ప్రతిఘటన చిత్రంలో విజయశాంతి పోషించిన అధ్యాపకురాలి పాత్రను అవమానించిన దుర్మార్గులకు సమాధానంగా ఈ పాట వస్తుంది. సమాజంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణంతో పోలుస్తూ, "మరో మహాభారతం" రాయాల్సిన పరిస్థితి వచ్చిందనే ఆవేదనను ఈ గీతం వ్యక్తం చేస్తుంది. వేటూరి కలం నుంచి జాలువారిన శక్తివంతమైన పదాలకు, చక్రవర్తి స్వరాలు తోడవగా, ఎస్. జానకి తన గాత్రంలో ఆవేదన, ఆగ్రహం, నిరసన, ధైర్యం—ఈ నాలుగు భావాలను అసాధారణంగా పలికించారు. ఈ పాటను వింటే అది సినిమా పాటలా కాకుండా, ఒక స్త్రీ సమాజాన్ని నిలదీసే ఆవేదనగా అనిపిస్తుంది. ఈ గీతంతో ప్రతిఘటన సినిమాకు మరింత గుర్తింపు వచ్చింది. తెలుగు సినీ చరిత్రలో మహిళా సాధికారతను అత్యంత శక్తివంతంగా ప్రతిబింబించిన గీతాల్లో ఇది అగ్రస్థానంలో నిలిచింది. వేటూరి రచనకు, జానకమ్మ గాత్రానికి ఈ పాట చిరస్మరణీయ ఉదాహరణగా నేటికీ నిలిచి ఉంది. ఈ గీతం రెండు నంది అవార్డులను కూడా అందుకుంది. ​

పద్మభూషణ్‌ ‌ తిరస్కరణ

2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ ను ప్రకటించింది. అయితే, ఆమె దీనిని తిరస్కరించారు. దక్షిణ భారత కళాకారులకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఈ గౌరవాన్ని గౌరవిస్తూనే నేను స్వీకరించలేను" అని ఆమె అప్పట్లోత చెప్పడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజానికి ఆమె దేశపు అత్యున్నత పురస్కారరానికి అర్హురాలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే అవార్డుల కంటే గౌరవాల కంటే ఆత్మగౌరవాన్ని పెద్దదిగా భావించిన కళాకారిణిగా ఆమె నిలిచిపోయారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్