ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పనులు కల్పించాలని గిరిజనులు ధర్నా

1 గంట క్రితం

dharna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 11:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-రావికమతం : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం సామలమ్మ కొండపై జీడి, మామిడి తోటల్లో జీవనం సాగిస్తున్న గిరిజనులు తమకు ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ ఆదివారం ధర్నా నిర్వహించారు. బెన్నవరం, సోంపురం బండలకు చెందిన 20 గిరిజన కుటుంబాలు సామలమ్మ కొండపై సుమారు 80 ఎకరాల్లో జీడి, మామిడి తోటలు సాగు చేస్తున్నాయి. ఈ భూములకు ఫారెస్ట్ పట్టాలు ఉన్నాయని వారు తెలిపారు. తోటల అభివృద్ధికి రాతికట్లు, టెర్రసింగ్ వంటి పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టి తమకు ఉపాధి కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. అటవీ భూముల్లో ఉపాధి పనుల కోసం అదనంగా 50 రోజులు, ప్రత్యేక పథకం కింద 125 రోజులు కలిపి మొత్తం 175 రోజుల పని కల్పించాల్సి ఉన్నప్పటికీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కూలి పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందని, అక్కడ సంపాదించిన కొద్దిపాటి ఆదాయం కూడా అనారోగ్య ఖర్చులకే సరిపోతోందని, తినడానికి తిండి కూడా లేని దుస్థితి నెలకొందని గిరిజనులు వాపోయారు. తమ జీడి, మామిడి తోటల్లోనే ఉపాధి పనులు కల్పించడంతో పాటు తోటలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ తోటల్లో ఉపాధి పనులు ప్రారంభించి, రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్